
India Squad for ICC T20I World Cup 2024: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుంచి USA, వెస్టిండీస్‌లలో ప్రారంభం కానుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ వేటలో ఉన్న టీమిండియాపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఈవెంట్‌లో భారత జట్టులో ఏ ఆటగాళ్లకు చోటు దక్కుతుందా అని అభిమానులు ఆసక్తి మొదలైంది. ఇదే క్రమంలో అసలు భారత జట్టును ఎప్పుడు ప్రకటిస్తారనే వార్తలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. స్పోర్ట్స్‌టాక్ నివేదిక ప్రకారం, ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం తమ ఆటగాళ్లను ప్రకటించడానికి భారత్‌తో సహా అన్ని జట్లకు మే 1, బుధవారం వరకు గడువు ఇచ్చింది. దీనితో పాటు కొన్ని నియమాలు కూడా ప్రకటించింది.
టోర్నీ కోసం ఒక జట్టు 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే, మే 25 వరకు జట్టులో మార్పులు చేయవచ్చు. అయితే, ఈ మార్పును ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదించాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ 2024 ఫైనల్ మే 27న జరగనుందని సమాచారం.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును మే 1న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ప్రపంచకప్‌కు ఆటగాళ్ల ఎంపికను బీసీసీఐ నిర్ణయించే అవకాశం ఉంది. కాబట్టి భారత జట్టు కోసం చివరి క్షణం వరకు వేచి ఉండి మే 1న వెల్లడించే అవకాశం ఉంది.
జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్ జట్టుతో భారత్ తమ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరగనున్న బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో టీమిండియా తలపడనుంది.
ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను తొలగించారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌లు 2024 T20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక కావడం సందేహాస్పదంగా మారింది.
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ధర్మశాలలో ఈనెల 7 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ ను 3-1తేడాతో గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి డబ్ల్యూటీసీలో అగ్రస్థానంలో నిలవాలని కోరుకుంటోంది.
ఐదో టెస్టుకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..