T20 World Cup 2026 : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది..ఐసీసీ రూల్ బుక్ చూస్తే పాక్ గుండె ఆగాల్సిందే

T20 World Cup 2026 : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారబోతోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అవుతోంది.

T20 World Cup 2026 : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది..ఐసీసీ రూల్ బుక్ చూస్తే పాక్ గుండె ఆగాల్సిందే
Team Pakistan

Updated on: Feb 03, 2026 | 5:45 PM

T20 World Cup 2026 : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారబోతోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అవుతోంది. రూల్ బుక్ చదవకుండా పాక్ చేసిన ఈ సాహసం వల్ల ఆ దేశం కేవలం పాయింట్లే కాదు, వందల కోట్ల ఆదాయాన్ని, చివరకు ఐసీసీ సభ్యత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అసలు ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? పాక్‌కు జరగబోయే ఆ భయంకర నష్టాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. షెడ్యూల్ చేసిన సమయానికి ఒక జట్టు మైదానంలోకి రాకపోతే వ్యాక్ ఓవర్ నిబంధన వర్తిస్తుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌కు పాక్ రాకపోతే, టీమిండియా గ్రౌండ్‌లో హాజరైతే చాలు.. భారత్‌కు నేరుగా 2 పాయింట్లు ఇస్తారు. దీనివల్ల పాక్ కేవలం పాయింట్లే కాదు, నెట్ రన్-రేట్ పరంగా కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. పాక్ జట్టు 20 ఓవర్లు ఆడి సున్నా పరుగులు చేసిందనే ప్రాతిపదికన రన్-రేట్ లెక్కిస్తారు, ఇది ఆ జట్టును టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేస్తుంది.

భారత్-పాక్ మ్యాచ్ అంటే బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే జియో-హాట్ స్టార్ వంటి సంస్థలకు దాదాపు 25 నుంచి 30 మిలియన్ డాలర్ల (సుమారు రూ.250 కోట్లు) నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీని డిమాండ్ చేస్తారు. ఐసీసీకి ఉన్న అధికారాల ప్రకారం, ఈ మొత్తం నష్టాన్ని పాకిస్థాన్ బోర్డు నుండే వసూలు చేస్తుంది. పాక్‌కు ఐసీసీ నుంచి అందే వార్షిక నిధులను నిలిపివేసి, ఆ డబ్బును పెనాల్టీగా మళ్లించే అవకాశం ఉంది.

ఐసీసీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4 D ప్రకారం.. ఏ దేశ క్రికెట్ బోర్డులోనైనా ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. కానీ ఇప్పుడు పాక్ ప్రభుత్వం అధికారికంగా మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో శ్రీలంక, జింబాబ్వే బోర్డులపై ఇలాంటి కారణాలతోనే ఐసీసీ నిషేధం విధించింది. ఇప్పుడు పాక్ విషయంలో కూడా అదే జరిగితే, ఆ దేశం అంతర్జాతీయ క్రికెట్ ఆడే అర్హతను కోల్పోతుంది. శ్రీలంక అనేది తటస్థ వేదిక కాబట్టి, అక్కడ భద్రతా పరమైన సాకులు చెప్పడానికి కూడా పాక్‌కు ఆస్కారం లేదు.

పాక్ తీసుకున్న ఈ మొండి నిర్ణయం వల్ల 2026 వరల్డ్ కప్ తర్వాత జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లేదా ఇతర ఐసీసీ టోర్నీలకు కూడా పాక్ దూరం కావాల్సి రావచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్క మ్యాచ్‌ను బహిష్కరించడం అనేది ఉండదు, అది మొత్తం టోర్నీని ప్రభావితం చేస్తుంది కాబట్టి కఠిన చర్యలు తప్పవు. ఈ పరిస్థితుల్లో పాక్ బోర్డు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, పాక్ క్రికెట్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి