బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

ICC Player of the Month March 2026: ప్రస్తుతం ఐపీఎల్ 2026 సందడి కొనసాగుతోంది. సంజూ శాంసన్ పేలవ ఫాంతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో చూపించిన ప్రదర్శన మేరకు ఐసీసీ ఓ ప్రతిష్టాత్మక లిస్ట్ లో చేర్చింది.

బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?
Sanju Samson Vs Jasprit Bumrah

Updated on: Apr 06, 2026 | 4:35 PM

ICC Player of the Month March 2026: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్చి 2026 నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ నామినీలను ప్రకటించింది. ఇందులో భారత జట్టు స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ చోటు దక్కించుకోవడం విశేషం. ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వీరిద్దరూ ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీపడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

2026 టీ20 ప్రపంచకప్‌లో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. భారత జట్టు ప్రపంచ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ ప్రారంభంలో తుది జట్టులో అవకాశం దక్కకపోయినా, కోచింగ్ సిబ్బంది తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంతో జట్టులోకి వచ్చిన సంజు, లభించిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.

ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో సంజు అజేయంగా 97 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. అదే ఊపును కొనసాగిస్తూ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో 89 పరుగులతో రాణించాడు. మార్చి నెలలో సంజు మొత్తం 275 పరుగులు సాధించాడు. ఇందులో విశేషం ఏమిటంటే, ఆయన సగటు 137.50 కాగా, స్ట్రైక్ రేట్ దాదాపు 199గా ఉండటం గమనార్హం.

బుమ్రా బౌలింగ్ విన్యాసాలు..

ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందిన జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై రెండు వికెట్లు తీసిన బుమ్రా, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు కానర్ ఎస్టర్ హ్యూజెన్ కూడా ఈ జాబితాలో నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తన తొలి అంతర్జాతీయ టి20 సిరీస్‌లో ఆయన 200 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

మహిళా విభాగంలో హోరాహోరీ పోటీ..

ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మెలీ కెర్ (న్యూజిలాండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), అయబొంగా ఖాకా (దక్షిణాఫ్రికా) నామినేట్ అయ్యారు. మెలీ కెర్ మార్చి నెలలో అటు బంతితోనూ, ఇటు బ్యాటుతోనూ అద్భుతాలు చేశారు. వన్డేల్లో 18 వికెట్లు తీయడంతో పాటు టి20ల్లోనూ రాణించారు. ఆస్ట్రేలియా వెటరన్ ప్లేయర్ బెత్ మూనీ భారత్‌పై సెంచరీతో మెరవగా, దక్షిణాఫ్రికా బౌలర్ అయబొంగా ఖాకా న్యూజిలాండ్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.

విజేత ఎవరనేది అభిమానుల ఓట్లు, ఐసీసీ నిపుణుల ప్యానెల్ నిర్ణయం ఆధారంగా త్వరలోనే వెల్లడి కానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us