ICC T20 World Cup 2026 : ఏంటీ అన్యాయం? టాపర్లందరూ ఒకే గ్రూపులో..సూపర్-8 ఫార్మాట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ICC T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 ఫార్మాట్‌పై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో అసమతుల్యత ఏర్పడిందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

ICC T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 ఫార్మాట్‌పై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో అసమతుల్యత ఏర్పడిందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. అసలు ఈ వివాదం ఏంటి? ఐసీసీ ఎందుకు విమర్శలు ఎదుర్కొంటోంది? వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్లకు తదుపరి రౌండ్లో కాస్త సులభమైన డ్రా వస్తుంది. కానీ ఈసారి ఐసీసీ టోర్నీ మొదలవ్వకముందే ఏ టీమ్ ఏ గ్రూపులో ఉండాలో ఫిక్స్ చేసేసింది. దీనినే ప్రీ-సీడింగ్ అంటారు. అంటే.. ఒక టీమ్ తన గ్రూపులో ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా.. ముందుగా అనుకున్న స్లాట్‌లోనే (ఉదాహరణకు X1 లేదా Y1) ఉంటుంది.
ఈ ముందస్తు నిర్ణయం వల్ల ఒక వింత పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ స్టేజ్‌లో టాపర్లుగా నిలిచిన భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, సౌతాఫ్రికా.. ఈ నలుగురు సూపర్-8లో ఒకే గ్రూపులో (గ్రూప్-1) చేరారు. మరోవైపు, రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లన్నీ రెండో గ్రూపులో (గ్రూప్-2) ఉన్నాయి. దీనివల్ల మొదటి రౌండ్లో అద్భుతంగా ఆడి అగ్రస్థానంలో నిలిచిన జట్లలో ఇద్దరు సెమీస్ చేరకుండానే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన జట్లకు సెమీస్ చేరడం పేపర్ మీద సులభంగా మారుతోంది. ఇది ప్రతిభను గౌరవించేలా లేదని విమర్శకులు అంటున్నారు.
గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లు చాలా ఉత్కంఠగా సాగాలి. కానీ ఈ ఫార్మాట్ వల్ల ఎవరు టాపర్‌గా నిలిచినా సూపర్-8 పొజిషన్ మారదు కాబట్టి, ఆ మ్యాచ్‌లకు విలువ లేకుండా పోతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఉదాహరణకు.. సౌతాఫ్రికా తన గ్రూపులో టాపర్‌గా నిలిచినా, న్యూజిలాండ్ (సెకండ్ వచ్చిన జట్టు) కంటే తక్కువ సీడింగ్‌లోనే కొనసాగాల్సి రావడం అన్యాయమని నిపుణులు వేలెత్తి చూపుతున్నారు.
ఈ విమర్శలపై ఐసీసీ స్పందిస్తూ.. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నందున రవాణా, భద్రత, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవడం కోసమే ఇలా చేశామని చెబుతోంది. వేల సంఖ్యలో ప్రయాణించే అభిమానులకు, మీడియాకు ఇబ్బంది కలగకుండా ఏ జట్టు ఎక్కడ ఆడుతుందో ముందే తెలిస్తే సౌకర్యంగా ఉంటుందని ఐసీసీ వాదన.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
