8 ఫుడ్ బ్రాండ్లకు FSSAI నోటీసులు! మీ సరుకుల లిస్ట్‌లో ఉన్నాయా.. చెక్ చేసుకోండి
FSSAI 8 ఆహార సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించే బ్రాండ్ పేర్లు, ఉత్పత్తి వాదనలను ఉపయోగిస్తున్నందున ఈ చర్య తీసుకుంది. ఎమామి, ప్లాన్ బి వంటి బ్రాండ్లు "ఆరోగ్యకరమైన" లేదా "వీగన్" వంటి తప్పుడు వాదనలు చేస్తున్నాయి.

దేశంలో ఆహార ఉత్పత్తుల ప్రకటనలు, బ్రాండ్ పేర్లపై కఠినంగా వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాజాగా ఎనిమిది ఆహార వ్యాపార సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను తప్పుదోవ పట్టించే బ్రాండ్ పేర్లు, వాణిజ్య నామాలు, ఉత్పత్తి వాదనలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. నోటీసులు అందుకున్న సంస్థల్లో.. ఎమామి హెల్తీ & టేస్టీ, హెల్త్ ఎయిడ్, ట్రూవీ/ట్రూవీస్, ది హెల్తీ ఫ్యాక్టరీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయిస్, ప్లాన్ బి ఫుడ్స్, న్యూహెర్బ్స్ బ్రాండ్లు ఉన్నాయి. ఈ నోటీసుల వివరాలను FSSAI తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.
కొద్ది రోజుల క్రితమే నెట్ల్స్ KFC ఇండియా, Open Secret వంటి సంస్థలకు కూడా ఇలాంటి అంశాలపై నోటీసులు పంపిన నేపథ్యంలో తాజా చర్య ప్రాధాన్యత సంతరించుకుంది. కోల్‌కతాకు చెందిన ఎమామి గ్రూప్ వంటనూనెల విభాగం “ఎమామి హెల్తీ అండ్ టేస్టీ” అనే పేరు వినియోగదారులకు ఆ ఉత్పత్తి ఆరోగ్యపరంగా మెరుగైనదనే భావన కలిగించే అవకాశం ఉందని FSSAI అభిప్రాయపడింది. అలాగే “ప్లాంట్ బేస్డ్ వీగన్”గా తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్న ప్లాన్ బి సంస్థకు, వీగన్ ఫుడ్ ఎండార్స్‌మెంట్‌కు అవసరమైన అనుమతులు లేనప్పటికీ ఆ విధంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఎదురవుతున్నాయి.
FSSAI has issued notices to several food business operators (FBOs) for violating provisions of the FSS Act, 2006 regarding misleading brand names, trade names, and product claims… (1)2 pic.twitter.com/CgSVspoQxS
— FSSAI (@fssaiindia) June 14, 2026
“జీరో మైదా హోల్ వీట్ బ్రెడ్”, “జీరో మైదా పిజ్జా బేస్” వంటి ఉత్పత్తుల పేర్లు కూడా వినియోగదారులను తప్పుదారి పట్టించే అవకాశముందని నియంత్రణ సంస్థ పేర్కొంది. ఇదే విధంగా “ట్రూ విటమిన్”, “హెల్తీ మిక్స్ వెజ్జీ చిప్స్”, “హెల్తీ రాగి చిప్స్”, “హెల్తీ మూంగ్ దాల్ చిప్స్” వంటి పేర్లు, ట్యాగ్‌లైన్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఆహార ఉత్పత్తుల లేబులింగ్, ప్రకటనలు శాస్త్రీయ ఆధారాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, ఆరోగ్య ప్రయోజనాలపై అతిశయోక్తి లేదా తప్పుదారి పట్టించే వాదనలు వినియోగదారుల హక్కులను దెబ్బతీస్తాయని FSSAI స్పష్టం చేసింది. ఈ నోటీసులకు సంబంధించి సంస్థల నుంచి వివరణలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
