U19 World Cup 2026 : జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం నమోదు

U19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఒక అద్భుతం జరిగింది. క్రికెట్ ప్రపంచంలో పసికూనగా భావించే జపాన్ జట్టు చరిత్ర సృష్టించింది. విండ్‌హోక్ వేదికగా జరిగిన 15వ స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ పోరులో జపాన్ అండర్-19 జట్టు, టాంజానియాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో జపాన్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

U19 World Cup 2026 : జపాన్ క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం..వరల్డ్ కప్‌లో తొలి విజయం నమోదు
Japan Cricket

Updated on: Jan 25, 2026 | 8:00 AM

U19 World Cup 2026 : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో జపాన్ జట్టు తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. టాంజానియాతో జరిగిన మ్యాచ్‌లో జపాన్ ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన టాంజానియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు ఎక్రీ హ్యూగో (55), అయాన్ షరీఫ్ (40) రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టాంజానియా ఒక దశలో 118/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. జపాన్ బౌలర్ల ధాటికి టాంజానియా బ్యాటర్లు పేకమేడలా కుప్పకూలారు. కేవలం 13 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 7 వికెట్లను కోల్పోయి, 38.3 ఓవర్లలో 131 పరుగులకే చాపచుట్టేసింది.

నిప్పులు చెరిగిన జపాన్ బౌలర్లు

జపాన్ బౌలర్ నిహార్ పర్మార్ టాంజానియా పతనాన్ని శాసించాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. నిఖిల్ పోల్ 3 వికెట్లతో సహాయపడగా, చార్లీ హరా-హింజే 2 వికెట్లు తీశాడు. వీరి బౌలింగ్ ధాటికి టాంజానియా మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ముఖ్యంగా నిహార్ వేసిన స్పెల్ మ్యాచ్‌ను పూర్తిగా జపాన్ వైపు తిప్పేసింది.

అలవోకగా ఛేజింగ్

132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. బౌలింగ్‌లో మెరిసిన నిహార్ పర్మార్, బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. మరో ఓపెనర్ టేలర్ వా(47)తో కలిసి తొలి వికెట్‌కు 122 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. టేలర్ వా రనౌట్ అయినప్పటికీ, నిహార్ పర్మార్(53 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయం తీరాలకు చేర్చాడు. చివర్లో హ్యూగో తాని-కెలీ వచ్చి ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో కేవలం 28.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశాడు.

చారిత్రాత్మక విజయం

జపాన్ జట్టుకు ఇది రెండో అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ. 2020లో మొదటిసారి ఆడినప్పుడు నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి 16వ స్థానంలో నిలిచింది. ఆరేళ్ల తర్వాత మళ్ళీ అదే ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో టాంజానియాను ఓడించి, గెలుపు రుచి చూడటమే కాకుండా 15వ స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు టాంజానియా ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే వెనుదిరిగింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న నిహార్ పర్మార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం జపాన్ క్రికెట్ భవిష్యత్తుకు పెద్ద ఊతతాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..