Harmanpreet Kaur : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి..వ్యూహంపై నోరు మెదపకుండా.. లోయర్ ఆర్డర్‌ను తప్పుపట్టిన కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత, టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్మృతి మంధాన (80), ప్రతికా రావల్ (75) అద్భుతమైన ఆరంభాన్ని అందించి.. 330 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ఆస్ట్రేలియా ఆ లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.

Harmanpreet Kaur : 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టుకు మరోసారి ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్‌లో తొలిసారిగా భారత టాప్-5 బ్యాటర్లు అద్భుతంగా రాణించి 330 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఈ ఓటమి తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విమర్శల వర్షం కురిపించింది. టాప్ ఆర్డర్ ఇచ్చిన బలమైన ఆరంభాన్ని లోయర్ ఆర్డర్ ఉపయోగించుకోలేకపోయిందని, దీనివల్ల టీమ్ మరో 30-40 పరుగులు తక్కువ చేసిందని లోయర్ ఆర్డర్ బ్యాటర్లను తప్పుబట్టింది. వ్యూహాత్మక లోపంపై మాత్రం ఆమె మౌనం వహించింది.
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (80 పరుగులు), ప్రతీక రావల్ (75 పరుగులు) తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీ20లలో తిరుగులేని ఆసీస్‌పై ఒక జట్టు 300 మార్కును దాటడం ఇదే మొదటిసారి. 42.5 ఓవర్లకు 294/4 తో ఉన్న భారత్, ఒకానొక దశలో 350+ పరుగులు చేస్తుందని అంతా భావించారు. అయితే, ఆ తర్వాత వికెట్ల పతనం మొదలైంది. తర్వాతి బ్యాటర్లు చేతులెత్తేయడంతో, భారత్ కేవలం 36 పరుగులు మాత్రమే జోడించి చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. అన్నాబెల్ సదర్లాండ్ లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చి తన కెరీర్‌లోనే తొలిసారి 5 వికెట్ల ఘనతను సాధించింది. భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌట్ అయింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. ఓటమికి ముఖ్యకారణాన్ని లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యంగా పేర్కొంది. “మేము మొదలుపెట్టిన విధానం చూస్తే, మరో 30-40 పరుగులు సులభంగా చేయగలిగేవాళ్లం. చివరి ఆరు ఓవర్లలో మేము పరుగులను మిస్ అయ్యాము, అదే మాకు నష్టాన్ని కలిగించింది. వికెట్ చాలా బాగా ఉంది. కానీ చివరి ఆరు ఓవర్లలో సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడం మా ఓటమికి కారణమైంది” అని హర్మన్‌ప్రీత్ స్పష్టం చేసింది.
ఓపెనర్ల భాగస్వామ్యాన్ని హర్మన్‌ప్రీత్ ప్రత్యేకంగా ప్రశంసించింది. “మా ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. వారి కారణంగానే మేము 300 పరుగుల మార్కును చేరుకోగలిగాము. కానీ చివరి ఐదు ఓవర్లు మాకు ఖరీదైనవిగా మారాయి. గత మూడు మ్యాచ్‌లలో మిడిల్ ఓవర్లలో మేము బాగా బ్యాటింగ్ చేయలేకపోయాము, కానీ లోయర్ ఆర్డర్ బాధ్యత తీసుకున్నారు. ఈరోజు మొదటి 40 ఓవర్లు బాగా ఆడాము. జరిగిన దాన్ని వదిలిపెట్టి, మేము ఎలా తిరిగి వస్తామనేదే ముఖ్యం. ఇలాంటివి జరుగుతుంటాయి” అని ఆమె పేర్కొంది.
బ్యాటింగ్‌ను బలోపేతం చేయడం కోసం భారత్ కేవలం ఐదుగురు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగింది. అయితే, ఈ ప్లాన్ మళ్లీ విఫలమైంది. చివరికి ఆరో బౌలర్‌గా హర్మన్‌ప్రీత్ కౌరే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ వ్యూహం గురించి విమర్శలు వచ్చినా, కెప్టెన్ మాత్రం దానిని సమర్థించుకుంది. “మేము కూర్చుని చర్చిస్తాం. ఈ కాంబినేషన్ మాకు విజయాలను అందించింది. రెండు ఓటములు వ్యూహాన్ని మార్చవు” అని హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యానించింది. తదుపరి మ్యాచ్‌లో భారత్ ఇండోర్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




