AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : పాండ్యాపై పిచ్చి ప్రేమ..12 రోజుల్లో 2000 కిమీ.. ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన డైహార్డ్ ఫ్యాన్

Hardik Pandya : హార్దిక్ పాండ్యాను కలవాలనే లక్ష్యంతో ఒడిశా నుంచి బెంగళూరుకు 2,000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన దీపక్ కుమార్ కల నెరవేరింది. అభిమానిని కలిసిన పాండ్యా ప్రత్యేక బహుమతులతో పాటు తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

Hardik Pandya : పాండ్యాపై పిచ్చి ప్రేమ..12 రోజుల్లో 2000 కిమీ.. ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన డైహార్డ్ ఫ్యాన్
Hardik Pandya
Rakesh
|

Updated on: Jul 03, 2026 | 6:46 AM

Share

Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో హార్దిక్‌కు సంబంధించిన ఒక వీరాభిమాని గాథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒడిశాకు చెందిన దీపక్ కుమార్ అనే యువకుడు తన అభిమాన క్రికెటర్‌ను ఎలాగైనా కలవాలనే పట్టుదలతో ఏకంగా సైకిల్ యాత్ర చేపట్టాడు. ఒడిశా నుంచి బెంగళూరు వరకు సుమారు 2000 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని కేవలం 12 రోజుల్లోనే సైకిల్‌పై అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

దీపక్ కుమార్ తన సైకిల్ ప్రయాణానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ వచ్చాడు. ప్రయాణం ప్రారంభంలో తన ఆరాధ్య దైవమైన హార్దిక్ పాండ్యాను అసలు కలవగలనా లేదా అనే సందేహాన్ని దీపక్ వ్యక్తం చేశాడు. అయితే, ఈ వీడియోలు కాస్తా హార్దిక్ పాండ్యా గర్ల్‌ఫ్రెండ్ మహిరా శర్మ కంట పడ్డాయి. దీపక్ పట్టుదలను చూసి చలించిపోయిన మహిరా.. అతని వీడియోపై స్పందిస్తూ “మేము మిమ్మల్ని హార్దిక్‌తో మాట్లాడిస్తాం, మీరు బెంగళూరు వచ్చేయండి” అని కామెంట్ రూపంలో ప్రామిస్ చేసింది. అన్నట్లుగానే మహిరా శర్మ తన మాటను నిలబెట్టుకుని, దీపక్ బెంగళూరు చేరుకోగానే హార్దిక్ పాండ్యాతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించింది.

చాలా రోజుల సుదీర్ఘ నిరీక్షణ, కఠినమైన ప్రయాణం తర్వాత దీపక్ కుమార్ తన రోల్ మోడల్ హార్దిక్ పాండ్యాను కలుసుకున్నాడు. ఈ అపురూప క్షణాల వీడియోలను కూడా అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఒడిశా సంస్కృతిని ప్రతిబింబించేలా దీపక్.. హార్దిక్ పాండ్యాకు ప్రముఖ పూరీ జగన్నాథ స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించాడు. దాంతో పాటు ఒక సాంప్రదాయ వస్త్రాన్ని హార్దిక్ మెడలో వేసి ఘనంగా సత్కరించాడు. తనను కలవడానికి ఇంత దూరం సైకిల్‌పై వచ్చిన అభిమానిని చూసి హార్దిక్ సైతం ఎంతో ఆనందానికి లోనయ్యాడు.

ఈ ముఖాముఖి భేటీ అనంతరం హార్దిక్ పాండ్యా తన పెద్ద మనసును చాటుకున్నాడు. దీపక్ మళ్లీ సైకిల్‌పై ఒడిశా వెళ్లే శ్రమ లేకుండా, అతని తిరుగు ప్రయాణానికి అయ్యే పూర్తి ఖర్చులను, ప్రయాణ ఏర్పాట్లను హార్దిక్ స్వయంగా చూసుకున్నట్లు దీపక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనితో పాటు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. హార్దిక్ ఆ యువకుడికి రూ.1.5 లక్షల నగదుతో పాటు, విరాట్ కోహ్లీ బ్రాండ్‌కు చెందిన సరికొత్త లగ్జరీ షూస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నగదు, షూస్ బహుమతికి సంబంధించిన వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

హార్దిక్ పాండ్యాతో జరిగిన ఈ అద్భుతమైన కలయిక దీపక్ కుమార్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. హార్దిక్‌ను కలిసేందుకు చేసిన ప్రయాణ వీడియోల వల్ల సోషల్ మీడియాలో అతని ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే లక్ష దాటేసింది. అతను పెడుతున్న ప్రతి వీడియోకు లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఒక సామాన్య అభిమానిగా ప్రయాణం మొదలుపెట్టిన దీపక్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయాడు.

Follow Us