AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : ఒక బ్రియాన్ లారా.. ఒక గిల్‌క్రిస్ట్‌లను మిక్సీలో వేస్తే వైభవ్.. గ్రేగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆటను బ్రియాన్ లారా, గిల్‌క్రిస్ట్‌ల మిశ్రమంగా అభివర్ణించిన గ్రేగ్ చాపెల్, ఆధునిక క్రికెట్‌లో బౌలర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బ్యాటర్లకు అధిక ప్రయోజనం కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Vaibhav Sooryavanshi : ఒక బ్రియాన్ లారా.. ఒక గిల్‌క్రిస్ట్‌లను మిక్సీలో వేస్తే వైభవ్.. గ్రేగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 09, 2026 | 8:32 PM

Share

Vaibhav Sooryavanshi : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ గ్రేగ్ చాపెల్ ఇటీవల రాసిన ఒక వ్యాసంలో భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైందని, ఆట మొత్తం బ్యాటర్ల వైపే మొగ్గు చూపుతోందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైభవ్ లాంటి యువ ఆటగాళ్ల ప్రతిభను మనం ఖచ్చితంగా గౌరవించాలని, అయితే ఎంతటి అద్భుతమైన బౌలర్లనైనా ఇంత చిన్న వయసులోనే సులువుగా ఫోర్లు, సిక్సర్లు కొట్టేయడం వెనుక క్రికెట్ వ్యవస్థలో ఉన్న లోపాలు కనిపిస్తున్నాయని చాపెల్ విశ్లేషించారు.

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి తనను ఎంతగానో ఆకట్టుకుందని గ్రేగ్ చాపెల్ స్పష్టం చేశారు. ఈ కుర్రాడి ఆట తీరును ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ లెజెండ్స్ తో ఆయన పోల్చారు. “వైభవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని బ్యాలెన్స్ చూస్తుంటే గ్రేట్ గ్రీమ్ పొలాక్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ గుర్తుకొస్తున్నారు. అతను ఎక్స్‌ట్రా కవర్ మీదుగా షాట్లు కొడుతుంటే బ్రియాన్ లారా క్లాస్, మొదటి బంతి నుంచే అటాక్ చేయాలనే ఆడమ్ గిల్‌క్రిస్ట్ ల అగ్రెసివ్ మైండ్‌సెట్ కలగలిసినట్లు అనిపిస్తుంది. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా సాంప్రదాయ టెక్నిక్ తో ఆడుతున్న వైభవ్ ఆట క్రికెట్ కు లభించిన అరుదైన బహుమతి” అని చాపెల్ కొనియాడారు.

వైభవ్ సాధిస్తున్న అసాధారణ విజయాలు ఒక రకంగా క్రికెట్ ప్రపంచానికి హెచ్చరిక లాంటివని చాపెల్ అభిప్రాయపడ్డారు. శారీరకంగా ఇంకా పూర్తిగా ఎదగని ఒక చిన్న పిల్లాడు అంతర్జాతీయ స్థాయి బౌలర్లను అంత ఈజీగా బౌండరీల అవతలకు పంపుతున్నాడంటే, బౌలింగ్ వ్యవస్థ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అత్యంత అధునాతనమైన పవర్‌ఫుల్ బ్యాట్లు, స్టేడియాలలో బాగా చిన్నవిగా చేసిన బౌండరీ లైన్లు, క్రీడకు ఏమాత్రం సహకరించని ఫ్లాట్ పిచ్‌లను తయారు చేయడం వల్లే బౌలర్ల ఉనికి ప్రమాదంలో పడిందని, ఆధునిక క్రికెట్‌ను పూర్తిగా బౌలింగ్ జాతిని విలుప్తం చేసేలా మార్చేశారని ఆయన మండిపడ్డారు.

క్రికెట్ ఆట ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన మలుపులో నిలబడిందని, క్రీడా నిర్వాహకులు తక్షణమే దీనిపై స్పందించాలని చాపెల్ కోరారు. “మన ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. క్రికెట్ కు ఉన్న 250 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను పక్కనపెట్టి, టీ20 ఫార్మాట్‌ను కేవలం ఒక వినోద సాధనంగా మార్చేసి, దానిని మేజర్ లీగ్ బేస్‌బాల్ లాగా తయారు చేయడం. రెండోది.. బ్యాట్‎కు, బంతికి మధ్య సరైన సమతూకాన్ని కాపాడుతూ పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయ క్రికెట్ ను గౌరవించడం” అని చాపెల్ స్పష్టం చేశారు. పాత రోజుల్లో కూడా భారీ హిట్టర్లు ఉండేవారని, కానీ నాణ్యమైన పిచ్‌లు, పవర్‌ఫుల్ బౌలింగ్ అటాక్ ముందు వారు కూడా ఇబ్బంది పడేవారని గుర్తుచేశారు.

నేటి తరం క్రికెట్ లో బౌలర్లను మరింత బలిపశువును చేయడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్‎లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమమే కారణమని గ్రేగ్ చాపెల్ ఘాటుగా విమర్శించారు. ఈ రూల్ పూర్తిగా బ్యాటింగ్ చేసే జట్లకు అపరిమితమైన లాభాన్ని చేకూరుస్తోందని దుయ్యబట్టారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అవుతారనే భయం లేదా వికెట్లు పడిపోతాయనే రిస్క్ ఈ రూల్ వల్ల పూర్తిగా తొలగిపోతుందని, దీనివల్ల టాప్ ఆర్డర్ బ్యాటర్లు మొదటి బంతి నుంచే ఎలాంటి అవుట్ అయ్యే భయం లేకుండా బౌలర్లపై విరుచుకుపడుతున్నారని, ఇది క్రికెట్ ఎదుగుదలకు ఏమాత్రం మంచిది కాదని చాపెల్ తన ఆవేదనను వెలిబుచ్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us