Asia Cup 2025: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో ఆ ప్లేయర్ అక్కర్లేదు! దిగ్గజ క్రికెటర్ కామెంట్స్
సునీల్ గవాస్కర్, ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. ఫైనల్ మ్యాచ్ కోసం బుమ్రాను సిద్ధం చేయాలని, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆయన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. మరి ఆయన ఎందుకు అలా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసియా కప్ 2025లో టీమిండియా ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 21న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో సూపర్ ఫోర్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే గ్రూప్ ఏలో జరిగిన మ్యాచ్లో పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. సూపర్ ఫోర్‌లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని, అసలు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ అవసరం లేదంటూ గవాస్కర్ పేర్కొన్నారు. పైగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కోసం బుమ్రాను సంసిద్ధం చేయాలని, బుమ్రా ఫైనల్‌కు ఫుల్ ఫిట్‌గా ఉండాలంటే పాక్‌తో మ్యాచ్‌కు రెస్ట్ ఇస్తే బెటర్ అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ నెల 28న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా కచ్చితం ఫైనల్ చేరుతుందని భారత క్రికెట్ అభిమానులు ధీమాగా ఉన్నారు.
అలాగే శుక్రవారం ఒమన్‌తో జరిగే మ్యాచ్ టీమిండియాకు తమ బ్యాటర్లను పరీక్షించుకునే అవకాశం ఇస్తుందని గవాస్కర్ అన్నారు. సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి వారికి క్రీజులో కొంత సమయం గడిపే అవకాశం ఇవ్వాలని అన్నారు. బుమ్రా ఇప్పటివరకు ఆసియా కప్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్‌లతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆడి మూడు వికెట్లు పడగొట్టాడు. మధ్యలో ఒక మ్యాచ్‌లో రెస్ట్ ఇస్తే బుమ్రా మరోసారి తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




