AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం.. 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాపై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించిన ఈజిప్ట్ 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. తొలిసారి వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ గెలిచి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధిస్తూ చరిత్ర సృష్టించింది.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయం.. 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రౌండ్ ఆఫ్ 16కు క్వాలిఫై
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 04, 2026 | 8:08 AM

Share

FIFA World Cup 2026 : ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌లో ఒక అద్భుతమైన సరికొత్త అధ్యాయం మొదలైంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరితమైన నాకౌట్ పోరులో ఆస్ట్రేలియాను ఓడించి ఈజిప్ట్ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. మెన్స్ వరల్డ్ కప్ చరిత్రలోనే గత 92 సంవత్సరాలుగా ఈజిప్ట్ ఒక్క నాకౌట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెక్సాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచి ఈజిప్ట్ సగర్వంగా రౌండ్ ఆఫ్ 16 (ప్రీ-క్వార్టర్స్)లోకి అడుగుపెట్టింది. నిర్ణీత సమయం, ఎక్స్‌ట్రా టైమ్ ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో, మ్యాచ్ విజేతను తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది.

పెనాల్టీ షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై ఈజిప్ట్ థ్రిల్లింగ్ విక్టరీ

పెనాల్టీ షూటౌట్‌లో ఈజిప్ట్ ఆటగాళ్లు అద్భుతమైన సంయమనం పాటించి 4-2 తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించారు. ఈజిప్ట్ తరఫున హోసామ్ అబ్దెల్మాగిద్ విన్నింగ్ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ గెలుపు ఖరారు కాగానే ఈజిప్ట్ స్టార్ ప్లేయర్, కెప్టెన్ మొహమ్మద్ సలా మైదానంలోనే ఆనందబాష్పాలు రాల్చాడు. ఆస్ట్రేలియాను ఓడించి తమ దేశ ఫుట్‌బాల్ కలని సాకారం చేసినందుకు ఈజిప్ట్ ఆటగాళ్లంతా ఒకరినొకరు కౌగిలించుకుని పండగ చేసుకున్నారు. మరోవైపు గెలుపు అంచుల్లో బోల్తా పడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

ఆస్ట్రేలియా కోచ్ ఆఖరి నిమిషం ప్లాన్ ఫ్లాప్

ఈ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్ ప్రారంభమవడానికి ముందు ఆస్ట్రేలియా కోచ్ టోనీ పోపోవిక్ ఒక పెద్ద ప్రయోగం చేశారు. షూటౌట్‌ను అడ్డుకోవడానికి అనుభవజ్ఞుడైన గోల్ కీపర్ మాథ్యూ ర్యాన్‌ను ఆఖరి నిమిషంలో మైదానంలోకి దించారు. కానీ ఆయన వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈజిప్ట్ అభిమానుల భారీ అరుపులు, ఈలల మధ్య ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా డిఫెండర్ హ్యారీ సౌటర్ మొదటి పెనాల్టీ షాట్‌ను గోల్ పోస్ట్‌కు పైగా కొట్టి ఆస్ట్రేలియాను డిఫెన్స్‌లో పడేశాడు. ఆ తర్వాత మొహమ్మద్ సలాతో సహా ఐదుగురు ఆటగాళ్లు వరుసగా గోల్స్ చేయగా, ఆస్ట్రేలియాకు చెందిన 18 ఏళ్ల యంగ్ డిఫెండర్ లూకాస్ హెరింగ్టన్ కొట్టిన షాట్ గోల్ బార్‌కు తగిలి వెనక్కి వచ్చేసింది. దీంతో ఈజిప్ట్ విజయం ఖాయమైంది.

నిర్ణీత సమయంలో 1-1తో హోరాహోరీ సమరం

అంతకుముందు జరిగిన ప్రధాన మ్యాచ్ విషయానికి వస్తే.. ఏడు సార్లు ఆఫ్రికన్ ఛాంపియన్‌గా నిలిచిన ఈజిప్ట్ మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలోనే ఖాతా తెరిచింది. ఇమామ్ ఆషౌర్ అద్భుతమైన హెడర్ గోల్‌తో ఈజిప్ట్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఎయిర్ కండిషన్డ్ సదుపాయం ఉన్న డల్లాస్ కౌబాయ్స్ హోమ్ గ్రౌండ్‌లో సుమారు 70,000 మంది అభిమానుల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. లీడ్ సాధించిన తర్వాత ఈజిప్ట్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే, మ్యాచ్ ద్వితీయార్థంలో అంటే 55వ నిమిషంలో ఈజిప్ట్ డిఫెండర్ మొహమ్మద్ హనీ బంతిని క్లియర్ చేయబోయి పొరపాటున తన సొంత గోల్ పోస్ట్‌లోనే హెడర్ వేయడంతో ఆస్ట్రేలియాకు 1-1తో ఈక్వలైజర్ లభించింది.

ఇరు జట్లకు చారిత్రాత్మక అవకాశం

మెన్స్ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ చరిత్రలో ఈ రెండు జట్లు కూడా ఇంతకుముందెన్నడూ నాకౌట్ మ్యాచ్ గెలవలేదు. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిస్తే సరికొత్త రికార్డు సృష్టించవచ్చని ఇరు జట్లు సర్వశక్తులూ ఒడ్డాయి. గత మ్యాచ్‌లో తగిలిన గాయం కారణంగా ఈజిప్ట్ కెప్టెన్ మొహమ్మద్ సలా ఈ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినప్పటికీ ఈజిప్ట్ జట్టు ఆఖరి నిమిషాల్లో ఆస్ట్రేలియా గోల్ పోస్ట్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి స్కోరు 1-1తో సమంగా ఉండటంతో మ్యాచ్ ఎక్స్‌ట్రా టైమ్‌కు వెళ్లింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఇరు జట్లు రక్షణ శ్రేణిని బలంగా ఉంచడంతో మరో గోల్ నమోదు కాలేదు. చివరకు పెనాల్టీ షూటౌట్ ద్వారా ఈజిప్ట్ చారిత్రాత్మక విజేతగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us