IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఓ వ్యక్తి భద్రతా వలయాన్ని బద్దలుకొట్టి మైదానంలోకి ప్రవేశించాడు. భారత జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి కెప్టెన్ రోహిత్ వద్దకు దూసుకెళ్లాడు. అయితే, రోహిత్ కోపానికి భయపడిన ఆ వ్యక్తి కింగ్ కోహ్లీ వైపు పరుగులు తీశాడు. ఆ తర్వాత కోహ్లి భుజంపై చేయి వేసి మైదానం మధ్యలో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సమయంలో, భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకుని మైదానం నుంచి బయటకు పంపించారు.
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మైదానంలోకి పరిగెత్తడం చూడొచ్చు. మొదట రోహిత్ వద్దకు పరుగులు తీసిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత కోహ్లీ వద్దకు చేరాడు. అనంతరం కోహ్లీని కౌగిలించుకుని భుజంపై చేయి వేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ సమయంలో కింగ్ కోహ్లీ కూడా సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించగా, వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకుని మైదానం నుంచి బయటకు తీసుకొచ్చారు.
Already a pitch invader #AUSvIND pic.twitter.com/2gjnwjJfmt
— Jooorp (@JRP2234_) December 27, 2024
ఇక ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ తరపున సామ్ కొన్‌స్టాస్ 60 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 52 పరుగులు, మార్నస్ లబుషానే 72 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో భారత్‌పై వరుసగా రెండో సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్ 197 బంతుల్లో 140 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో తన హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. 63 బంతుల్లో 49 పరుగులు చేశాడు. భారత్ తరపున మరోసారి మెరిసిన జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీశాడు. ఆకాశ్‌దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ ఏకైక వికెట్ తీశాడు.
తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఎనిమిది పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా కూడా విఫలమైన రోహిత్ శర్మ.. రెండో ఓవర్‌లోనే బోలాండ్‌కి క్యాచ్ ఇచ్చి పాట్ కమిన్స్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. రోహిత్‌కు ఓపెనర్ స్థానం కల్పించేందుకు శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించారు. అయితే, హిట్‌మ్యాన్ మళ్లీ ఫ్లాప్ అయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్ కూడా 24 పరుగుల వద్ద పెలియన్ చేరాడు. ప్రస్తుతం వార్త రాసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ప్రస్తుం కోహ్లీ, జైస్వాల్ క్రీజులో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..