రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి! సెలెక్టర్లకు ఫ్యాన్స్ సూటి ప్రశ్న

ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతడిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లిష్ట పరిస్థితులు, గత ప్రదర్శనలు, అనుభవం దృష్ట్యా రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రోహిత్‌ని తప్పించే ముందు వీటికి జవాబు చెప్పండి! సెలెక్టర్లకు ఫ్యాన్స్ సూటి ప్రశ్న
Rohit And Agarkar

Updated on: Jul 17, 2026 | 3:12 PM

ఇంగ్లాండ్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో టీమిండియా వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతోంది. 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు యాజమాన్యం దీర్ఘకాలిక ప్రణాళికల్లో రోహిత్‌కు స్థానం లేదని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేయడంతో విమర్శలు మరింత పెరిగాయి. అయితే, ప్రస్తుతం రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించడం తొందరపాటు నిర్ణయం అవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

రోహిత్ ఒక్కడే స్ట్రగుల్ కాలేదు..

ఇంగ్లాండ్ పరిస్థితుల్లో భారత బ్యాటర్లందరూ దాదాపు ఇబ్బందులు పడుతున్నారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రోహిత్ మాత్రమే కాకుండా విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వంటి కీలక బ్యాటర్లు కూడా ఈ సిరీస్‌లో నిలకడగా రాణించలేకపోయారు. కొత్త బంతి స్వింగ్, అదనపు బౌన్స్ వంటి పరిస్థితులు ఓపెనర్లకు మరింత సవాలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క రోహిత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరో ఛాన్స్ అవసరం..

రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతడు తన బ్యాటింగ్ శైలిలో మార్పులు చేసుకున్నాడు. దూకుడుగా ఆడే విధానానికి బదులుగా పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ మార్పు అతడి సహజ ఆటపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న తదుపరి వన్డే సిరీస్‌లో అతడికి మరో అవకాశం ఇస్తే తిరిగి తన పాత ఫామ్‌ను అందుకునే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

మరీ అంత చెత్త ఫామ్ కాదు..

గణాంకాల పరంగా చూసినా రోహిత్ పరిస్థితి అంత నిరాశాజనకంగా లేదని విశ్లేషణలు చెబుతున్నాయి. గత 12 నెలల్లో భారత తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. ఈ కాలంలో ఒక సెంచరీతో పాటు నాలుగు అర్ధసెంచరీలు కూడా నమోదు చేశాడు. 2026లో అతడి సగటు, స్ట్రైక్‌రేట్ అతని స్థాయికి తగ్గట్లుగా లేకపోయినా, జట్టులో స్థానం కోల్పోయేంతగా పడిపోలేదని గణాంకాలు సూచిస్తున్నాయి.

కాగా, 2022 నుంచి టీమిండియాలో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం అవసరమే అయినప్పటికీ, రోహిత్ వంటి సీనియర్‌ని ఒక్క సిరీస్ ఆధారంగా పక్కన పెట్టడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2027 ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉండటంతో, అతడికి మరో అవకాశం ఇచ్చి తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు భారత క్రికెట్‌లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us