
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమంటూ భారత యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిలాసఫీకి పక్కాగా సరిపోతాడని నిరూపించుకున్నాడు.
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఈ భారీ స్కోరు వెనుక యువ సంచలనం ధృవ్ జురెల్ అటాకింగ్ ఇన్నింగ్స్ పాత్ర ఎంతో ఉంది. క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచి లంక స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 68 బంతుల్లోనే 75 స్ట్రైక్ రేట్‌తో 51 పరుగులు సాధించాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనుంజయ డి సిల్వా పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్‌కు జురెల్ వెనుదిరగాల్సి వచ్చింది. మైదానాన్ని వీడే ముందు అతడు జట్టుకు అందించాల్సిన ఊపును అందించాడు.
ఈ అర్ధశతకం అనంతరం జురెల్ చేసిన కామెంట్స్ యావత్ భారత క్రీడాభిమానుల మనసు గెలుచుకున్నాయి. “నేనెప్పుడూ నా వ్యక్తిగత మైలురాళ్ల కోసం క్రికెట్ ఆడను, ఆ సమయానికి జట్టుకు ఎలాంటి బ్యాటింగ్ అవసరమో అలా ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తాను” అని అతడు కుండబద్దలు కొట్టాడు. ఈ మాటలు విన్న క్రికెట్ పండితులకు వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గుర్తుకు వచ్చాడు. 2024 మధ్యలో కోచ్ బాధ్యతలు చేపట్టిన గంభీర్ మొదటి నుంచి చెబుతున్న మాటలనే జురెల్ ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఆటగాళ్లు తమ వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయాల కోసం ఆడాలనేది గంభీర్ బలమైన నమ్మకం.
సరిగ్గా ఈ ఏడాది ఆరంభంలో అహ్మదాబాద్ వేదికగా భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ దక్కించుకున్న తర్వాత గంభీర్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పాడు. రికార్డుల కన్నా ట్రోఫీలను సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్‌కు, మీడియాకు గట్టిగా సూచించాడు. సంజూ శాంసన్ ఆడిన వరుస ఇన్నింగ్స్‌లను (97 నాటౌట్, 89, 89) ఉదాహరణగా చూపుతూ, అతడు కేవలం తన సెంచరీ కోసం ఆడి ఉంటే జట్టు 250 పరుగులు సాధించేది కాదని గంభీర్ స్పష్టం చేశాడు. ఇప్పుడు జురెల్ ఆడిన తాజా ఇన్నింగ్స్ సైతం అచ్చం అదే కోవలోకి వస్తుంది. తన రికార్డుల కోసం నెమ్మదిగా ఆడకుండా, జట్టు స్కోరును పెంచే క్రమంలోనే అతడు వేగంగా బ్యాటింగ్ చేసి కోచ్ నమ్మకాన్ని నిలబెట్టాడు.
ఫిబ్రవరి 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన జురెల్, ఆ తర్వాత 2025లో వెస్టిండీస్‌పై అద్భుత మ్యాచ్ విన్నింగ్ శతకంతో సత్తా చాటాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 55కు పైగా సగటు ఉన్న ఈ 25 ఏళ్ల కుర్రాడు.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం తన పూర్తి సామర్థ్యాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఇప్పటివరకు ఆడిన 11 టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌లు ఆడి కేవలం 35.26 సగటుతో 529 పరుగులు మాత్రమే సాధించాడు. భారత జట్టులో వికెట్ కీపర్ స్థానానికి విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో, ఈ లంక సిరీస్ అతడి కెరీర్‌కు అత్యంత కీలకం. మిగిలిన మూడు ఇన్నింగ్స్‌లలోనూ విదేశీ గడ్డపై స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొని భారీ స్కోర్లు సాధిస్తేనే జట్టులో అతడి స్థానం సుస్థిరమవుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.