AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News: మానసిక సమస్యలు, ఒంటరితనంతో పోరాటం..మాజీ క్రికెటర్ కన్నుమూత

ఇంగ్లాండ్‌ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ రాబిన్ స్మిత్ మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తన 62వ ఏట అనూహ్యంగా మరణించారు. స్మిత్ మరణ వార్తను ఆయన హాంప్‌షైర్ మాజీ సహచరుడు కెవన్ జేమ్స్, బీబీసీ రేడియో ద్వారా తెలియజేశారు. 1980లు, 90లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వెస్టిండీస్ బౌలర్లను సైతం ఎదుర్కొని ధైర్యంగా ఆడిన చరిత్ర రాబిన్ స్మిత్ ది.

Cricket News: మానసిక సమస్యలు, ఒంటరితనంతో పోరాటం..మాజీ క్రికెటర్ కన్నుమూత
Robin Smith
Rakesh
|

Updated on: Dec 02, 2025 | 6:38 PM

Share

Cricket News: ఇంగ్లాండ్‌ మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ రాబిన్ స్మిత్ మంగళవారం నాడు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తన 62వ ఏట అనూహ్యంగా మరణించారు. స్మిత్ మరణ వార్తను ఆయన హాంప్‌షైర్ మాజీ సహచరుడు కెవన్ జేమ్స్, బీబీసీ రేడియో ద్వారా తెలియజేశారు. 1980లు, 90లలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వెస్టిండీస్ బౌలర్లను సైతం ఎదుర్కొని ధైర్యంగా ఆడిన చరిత్ర రాబిన్ స్మిత్ ది. క్రీడా జీవితం తర్వాత, ఆయన మద్యం వ్యసనం, ఒంటరితనం, మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడారు. ఈ విషాద వార్తతో క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.

రాబిన్ స్మిత్ మరణ వార్తను మొదట ఆయన మాజీ సహచరుడు కెవన్ జేమ్స్ ధృవీకరించారు. రాబిన్ స్మిత్ డిసెంబర్ 1, 2025 న ఆస్ట్రేలియాలోని సౌత్ పెర్త్లోని తన అపార్ట్‌మెంట్‌లో అనూహ్యంగా మరణించినట్లు ఆయన కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది. మరణానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. “అతను అద్భుతమైన ఆటగాడు ముఖ్యంగా 80లు, 90లలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లందరూ ఉన్నప్పుడు, వారిని నిలబడి ధైర్యంగా ఎదుర్కొన్న కొద్దిమంది ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఆయన ఒకరు” అని కెవన్ జేమ్స్ గుర్తుచేసుకున్నారు.

“రాబిన్ స్మిత్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. ధైర్యవంతుడు, డాషింగ్ బ్యాట్స్‌మెన్ అయిన రాబిన్, హాంప్‌షైర్ ఇంగ్లాండ్ తరఫున ఆడి లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నారు” అని కుటుంబ సభ్యులు తెలిపారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన రాబిన్ స్మిత్, అంతర్జాతీయ క్రికెట్‌లో, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో విశేషమైన రికార్డులను కలిగి ఉన్నారు.

1988, 1996 మధ్య ఇంగ్లాండ్ తరఫున 62 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 43.67 సగటుతో 4236 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్‌పై 175 పరుగులు అతని అత్యధిక స్కోరు. 71 వన్డేలలో 39.01 సగటుతో 2419 పరుగులు చేశారు, ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. 1993లో ఆస్ట్రేలియాపై ఎడ్జ్‌బాస్టన్‌లో ఆయన చేసిన అజేయ 167* పరుగుల ఇన్నింగ్స్ చరిత్రలో చిరస్మరణీయమైనది. హాంప్‌షైర్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన స్మిత్, 426 మ్యాచ్‌లలో 61 సెంచరీలతో 26,155 పరుగులు సాధించారు.

రిటైర్మెంట్ తర్వాత రాబిన్ స్మిత్ మానసిక ఆరోగ్యం, మద్యపానం వంటి వ్యక్తిగత సమస్యలతో పోరాడారు. ఈ పోరాటాల గురించి ఆయన బహిరంగంగా మాట్లాడారు. గత సంవత్సరం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. స్మిత్ తాను ఆత్మహత్య గురించి ఎలా ఆలోచించానో వివరించారు. “ఒక హోటల్‌లో చెక్-ఇన్ చేసి, డ్రింక్స్, మాత్రలు తీసుకుని, బాల్కనీ నుంచి దూకి ఆ జీవితాన్ని ముగించాలని ప్లాన్ చేసుకున్నాను” అని ఆయన వెల్లడించారు.

తన అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగం మానేసిన తర్వాత మద్యపాన సమస్య, ఒంటరితనంతో తాను పోరాడాల్సి వచ్చిందని ఆయన వివరించారు. “నేను మళ్లీ తాగుడుకి బానిస అయ్యాను. ఇదంతా ఒక రక్తపు సుడిగుండం లాంటిది. నేను ఎవరినీ నిందించలేను ” అని ఆవేదన వ్యక్తం చేశారు. “రాబిన్ స్మిత్ ప్రపంచంలోని అత్యంత ఫాస్ట్ బౌలర్లలో కొందరిని ధైర్యంగా ఎదుర్కొని, ఇంగ్లాండ్ అభిమానులకు ఎంతో గర్వాన్నిఇచ్చారు” అని ECB చైర్మన్ రిచర్డ్ థామ్సన్ నివాళులర్పించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..