Cheteshwar Pujara: ఫైర్ మీదున్న పుజారా.. 20 ఫోర్లు, 5 సిక్స్‌లతో 174 రన్స్.. వరుసగా రెండో సెంచరీ
టెస్టు జట్టులోకి ఘనంగా పునరాగమనం చేసిన భారత స్టార్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు సంపాదించేందుకు సిద్ధమవుతున్నాడా?. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అతని ఆటతీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది
టెస్టు జట్టులోకి ఘనంగా పునరాగమనం చేసిన భారత స్టార్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు సంపాదించేందుకు సిద్ధమవుతున్నాడా?. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అతని ఆటతీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. పుజారా చివరిగా 8 సంవత్సరాల క్రితం భారత జట్టు తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. తాజాగా వరుసగా రెండు సెంచరీలు సాధించి మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఈ ఏడాది మార్చి నుంచి ఇంగ్లండ్‌లో ఉన్న పుజారా.. ససెక్స్ తరఫున సెంచరీలు, డబుల్ సెంచరీలు బాదేస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ రెండో విభాగంలో పుజారా 2 డబుల్ సెంచరీలతో సహా మొత్తం 5 సెంచరీలు చేశాడు. ఇప్పుడు వన్డే టోర్నమెంట్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను చాటుకుంటున్నాడు . రాయల్ లండన్ వన్ డే కప్‌లో భాగంగా పుజారా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. రెండు రోజుల క్రితం వార్విక్‌షైర్‌పై పుజారా 79 బంతుల్లో 107 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
ఈసారి అంతకుమించి..
ఈసారి పుజారా మరింతగా చెలరేగాడు. ప్రమాదకరమైన ఫామ్‌ను కనబరుస్తూ సర్రే బౌలర్లను భీకరంగా దెబ్బతీస్తూ 174 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 131 బంతుల్లోనే 20 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 174 పరుగులు చేశాడు. 132 స్ట్రైక్ రేట్ తో ఈ ఇన్నింగ్స్ సాగడం విశేషం. 69 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా ఆ తర్వాత 103 బంతుల్లో సెంచరీకి చేరుకున్నాడు. దీని తర్వాత కేవలం 28 బంతుల్లో తదుపరి 74 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే, పుజారా లిస్ట్ ఎ కెరీర్‌లోనూ ఇదే అత్యధిక స్కోరు. నాలుగో ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చిన పుజారా.. టామ్ క్లార్క్ తో కలిసి మూడో వికెట్ కు 205 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్లార్క్ కూడా సెంచరీ చేశాడు. పుజారాకు కూడా డబుల్ సెంచరీ చేస్తాడని భావించారు. అయితే 48వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే పుజారా చలవతో ససెక్స్ ఏకంగా 350 పరుగుల భారీ స్కోరు సాధించింది.