CSK: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్.. విశాఖలో చెన్నై మ్యాచ్‌కు హాట్ కేకుల్లా టికెట్లు..

ఐపీఎల్ అంటేనే క్రేజ్. అదీ దాదాపు ఐదేళ్ల తర్వాత సిటీ ఆఫ్ డెస్టినీ వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో విశాఖ నగరానికి క్రికెట్ ఫీవర్ వచ్చింది. నగరంలోని అన్ని వర్గాలు ప్రస్తుతం టికెట్లను దక్కించుకునే ప్రయత్నంలో పడ్డాయి. విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో..

CSK: ధోనికి ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్.. విశాఖలో చెన్నై మ్యాచ్‌కు హాట్ కేకుల్లా టికెట్లు..
Ipl 2024

Edited By: Ravi Kiran

Updated on: Mar 30, 2024 | 6:39 PM

ఐపీఎల్ అంటేనే క్రేజ్. అదీ దాదాపు ఐదేళ్ల తర్వాత సిటీ ఆఫ్ డెస్టినీ వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో విశాఖ నగరానికి క్రికెట్ ఫీవర్ వచ్చింది. నగరంలోని అన్ని వర్గాలు ప్రస్తుతం టికెట్లను దక్కించుకునే ప్రయత్నంలో పడ్డాయి. విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో వాస్తవానికి మార్చి 27 ఉదయం 10 గంటలకు టికెట్ సేల్ ప్రారంభం అయింది. ఆశ్చర్యంగా ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయని క్రికెట్ ప్రేమికులు వాపోతున్నారు. టికెట్ అమ్మకాలు ప్రారంభం అయిన రోజు ఉదయం 10.10 గంటల ప్రాంతంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు యాప్‌లోకి లాగిన్ అయ్యానని, వెయిటింగ్ లిస్ట్ నంబర్ 69 వేలు ఉండటం చూసి షాక్ అయ్యానని నగరానికి చెందిన లోకేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి తెలిపాడు. టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు దాదాపు 50 నిమిషాల పాటు వేచి చూశామని, చాలాసేపు నిరీక్షించిన తర్వాత అతడి సంఖ్య దగ్గరకు వచ్చిన సమయంలో టిక్కెట్లు మొత్తం అమ్ముడైపోయాయని తెలుసుకుని నిరుత్సాహానికి గురయ్యానన్నాడు. అదే సమయంలో నగరానికి చెందిన బీటెక్ స్టూడెంట్ రవీంద్ర మాట్లాడుతూ.. విపరీతమైన డిమాండ్‌ను ఊహించి అతడి ఐదుగురు స్నేహితులు ఆరోజు ఉదయం 10 గంటల నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని, వారిలో ఒకరికి మాత్రమే అదృష్టవశాత్తూ రెండు టిక్కెట్లు వచ్చాయని చెప్పాడు.

టికెట్ల అమ్మకాలు ప్రారంభం అయిన మొదటి రోజే కొన్ని గంటల్లో అమ్ముడు అయిపోయాయి. తర్వాత ఎప్పుడు చూసినా Sold out బోర్డ్‌లే. రెండు రోజుల పాటు అలానే ఉంచి ఈలోపు కావాల్సిన వాళ్లకు సెపరేట్ లింక్‌కు పెట్టి అమ్మేసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం నుంచి రూ. 1000, రూ. 2,000, రూ. 3000, రూ. 5000 ఉన్న టికెట్లను రూ. 11,000, రూ. 15,000, రూ. 20,000, రూ. 30,000లకు పెంచి అమ్ముతున్నట్టు వాపోతున్నారు క్రికెట్ ప్రేమికులు. మరీ ఇంత కమర్షియలైజ్ అయితే మ్యాచ్‌లు చూడడం కష్టమే అంటున్నారు సామాన్య క్రికెట్ ప్రేమికులు.

ధోనీ చివరి మ్యాచ్ అంటూ ప్రచారం..

ఆదివారం జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ టిక్కెట్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సీఎస్‌కె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదేళ్ల తర్వాత విశాఖపట్నంకు తిరిగి రావడం, ఆ రోజు వారాంతం కావడం ఒక రీజన్ అయితే.. ధోనికి ఇదే చివరి మ్యాచ్ అంటూ కూడా ప్రచారం జరగడంతో ఆదివారం మ్యాచ్ టిక్కెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మరొకవైపు ఏప్రిల్ 3న విశాఖపట్నంలో డీసీ, కేకేఆర్ మధ్య జరిగే రెండో మ్యాచ్ టిక్కెట్లకు మార్చి 27 సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నా.. ప్రస్తుతం ఆ టిక్కెట్లపై ఎవరూ ఆసక్తి చూపకపోవడం విశేషం. సీఎస్‌కే బృందం గురువారమే విశాఖపట్నం చేరుకోగా.. టీమ్ డీసీ జైపూర్‌లో గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడి అక్కడ నుంచి శుక్రవారం విశాఖపట్నం చేరుకుంది.

పార్కింగ్ ప్రదేశాలు ఇవే – పోలీస్ సూచనలు..

ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు ఇవే. మ్యాచ్ రాత్రి 07 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది కాబట్టి స్టేడియం కెపాసిటీ 28 వేలు కావున.. కాబట్టి మ్యాచ్‌తో సంబంధం లేని వాహనదారులు మధురవాడ క్రికెట్ స్టేడియం వైపు ప్రయాణించకుండా వేరే మార్గాలలో ప్రయాణించమని చెప్పారు.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే బస్సులు, ఇతర కమర్షియల్ వాహనాలు మారికవలస వద్ద ఎడమవైపు తిరిగి జురాంగ్ జంక్షన్ మీదుగా తిమ్మాపురం చేరి కుడివైపు తిరిగి బీచ్ రోడ్డు గుండా ప్రయాణించి ఋషికొండ, సాగర్ నగర్, జోడుగుళ్లపాలెం మీదుగా వెళ్లాలని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుంచి వచ్చే కారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మొదలైనవి కార్ షెడ్ ముందు గల PEPSI cutting గుండా మిధులాపురి కాలనీ మీదుగా MVV సిటీ వెనుకగా వెళ్లి, లా కాలేజీ రోడ్డు మీదగా NH-16 చేరుకుని నగరంలోకి వెళ్ళవలెను. లా కాలేజ్ రోడ్డు నుండి పనోరమ హిల్స్ మీదుగా, ఋషికొండ మీదుగా నగరంలోకి వెళ్ళవచ్చును.

విశాఖపట్నం నగరంలో నుంచి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు బస్సులు ఇతర కమర్షియల్ వాహనములు హనుమంతవాక నుండి ఎడమవైపు తిరిగి ఆరిలోవ BRTS రోడ్డులో వెళ్లి అడవివరం వద్ద కుడివైపు తిరిగి ఆనందపురం మీదుగా వెళ్ళవలెను.

విశాఖపట్నం నగరంలో నుండి ఆనందపురం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్ళు కార్లు, ద్విచక్ర వాహనాలు ఆటోలు మొదలైనవి హనుమంతవాక జంక్షన్ నుండి ఎడమవైపు తిరిగి అడవివరం మీదుగా ఆనందపురం వెళ్ళవచ్చు లేదా హనుమంతవాక జంక్షన్ లేదా విశాఖ వ్యాలీ జంక్షన్ లేదా ఎండాడ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి బీచ్ రోడ్ గుండా వెళ్ళి తిమ్మాపురం వద్ద ఎడమవైపు తిరిగి మారికవలస వద్ద NH-16 చేరుకోవచ్చును.

క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే వాహనదారులకు సూచనలు:

విశాఖపట్నం నగరం నుండి స్టేడియం వైపుకు వచ్చు VVIP, VIP వాహనదారులు NH-16 నందు స్టేడియం వరకు ప్రయాణించి A గ్రౌండ్, B గ్రౌండ్ మరియు V కన్వెన్షన్ గ్రౌండ్లలో వారి వారి పాసు ప్రకారం చేరుకోవలెను.

విశాఖపట్నం వైపు నుండి క్రికెట్ స్టేడియంకు వచ్చు ఇతర టికెట్ హోల్డర్స్ NH-16 లో ప్రయాణించి స్టేడియం వద్ద గల ఓల్డ్ఏజ్ హోం జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకొనవలెను.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం, గంభీరం, బోయపాలెం, కొమ్మాది వైపు నుండి వచ్చువారు కార్ షెడ్ జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి సాంకేతిక కాలేజ్ పార్కింగ్ గ్రౌండ్ చేరవలెను లేదా కార్ షెడ్ జంక్షన్ ముందు గల PEPSI కటింగ్ నుండి ఎడమవైపు తిరిగి మిధులాపురి కాలనీ మీదుగా వచ్చి MVV సిటీ డబల్ రోడ్డు, పోలిశెట్టి వేణుగోపాలరావు గ్రౌండ్ లో పార్కింగ్ చేయవలెను.

విశాఖపట్నం నగరం నుండి లేదా భీమిలివైపు నుండి బీచ్ రోడ్డు మీదగా స్టేడియం కు వచ్చు వారు IT Sez మీదుగా వచ్చి MVV సిటీ డబల్ రోడ్డు చేరి పార్కింగ్ చేసుకోవలెను.
విశాఖపట్నం నగరం నుండి వచ్చే RTC స్పెషల్ బస్సులు NH-16 లో రాకుండా బీచ్ రోడ్ లో వచ్చి IT Sez మీదుగా లా కాలేజీ రోడ్డు లో పార్కింగ్ చేయవలెను.

శ్రీకాకుళం, విజయనగరం, ఆనందపురం వైపు నుండి వచ్చే RTC స్పెషల్ బస్సులు మారికవలస వద్ద ఎడమవైపు తిరిగి తిమ్మాపురం రోడ్డు మీదుగా వచ్చి జురాంగ్ జంక్షన్ వద్ద కుడివైపుకు తిరిగి లా కాలేజ్ వద్దకు చేరుకుని పార్కింగ్ చేయవలెను.

పత్రికా విలేకరులు తమ వాహనాలను తమకు కేటాయించిన Gate No.10 & 11 (శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద) పార్కింగ్ స్థలమునకు కార్ షెడ్ మీదుగా చేరుకొని పార్కింగ్ చేసుకోవాలన్నారు.

మ్యాచ్ అనంతరం సాంకేతిక కాలేజ్ పార్కింగ్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకున్న వాహన దారులు తిరిగి వెళ్ళేటప్పుడు విజేత సూపర్ మార్కెట్ మరియు కార్ షెడ్ మీదుగా ప్రయాణించాలని విశాఖ నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.