Team India : టీమిండియా ముందు 338 పరుగుల టార్గెట్..స్వదేశంలో భారత్ బెస్ట్ రన్ ఛేజ్ ఎంతో తెలుసా?
Team India : న్యూజిలాండ్ జట్టు ఇండోర్ స్టేడియంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ ఒక విదేశీ జట్టు సాధించిన అత్యధిక వన్డే స్కోరు (337) ఇదే. గతంలో 2023లో భారత్‌పై 295 పరుగులు చేసిన కివీస్, ఇప్పుడు తన రికార్డును తనే తిరగరాసింది.

Team India : ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించారు. నిర్ణీత 50 ఓవర్లలో కివీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇప్పుడు సిరీస్ సొంతం చేసుకోవాలంటే టీమిండియా ముందు 338 పరుగుల భారీ టార్గెట్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ గతంలో ఇంతటి భారీ టార్గెట్లను ఛేదించిందా? మన దేశంలో టీమిండియా బెస్ట్ రన్ ఛేజ్ రికార్డులేంటో ఓ లుక్కేద్దాం.
న్యూజిలాండ్ జట్టు ఇండోర్ స్టేడియంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ ఒక విదేశీ జట్టు సాధించిన అత్యధిక వన్డే స్కోరు (337) ఇదే. గతంలో 2023లో భారత్‌పై 295 పరుగులు చేసిన కివీస్, ఇప్పుడు తన రికార్డును తనే తిరగరాసింది. డారిల్ మిచెల్ మరోసారి భారత్‌పై పగబట్టినట్టు ఆడి 131 బంతుల్లో 137 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 88 బంతుల్లోనే 106 పరుగులతో రెచ్చిపోయాడు. చివర్లో కెప్టెన్ బ్రేస్‌వెల్ (28 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో స్కోరు 330 దాటింది.
టీమిండియాకు భారీ లక్ష్యాలను ఛేదించడం కొత్తేమీ కాదు. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ అత్యంత విజయవంతమైన రన్ ఛేజ్ 362 పరుగులు. 2013లో జైపూర్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 43.3 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి 362 పరుగులు సాధించి భారత్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే 2017లో ఇంగ్లాండ్‌పై పుణె వేదికగా 356 పరుగుల లక్ష్యాన్ని కూడా భారత్ విజయవంతంగా ఛేదించింది. కాబట్టి ఇండోర్ లాంటి చిన్న మైదానంలో 338 పరుగులు చేయడం భారత బ్యాటర్లకు అసాధ్యమేమీ కాదు.
ప్రస్తుతం టీమిండియాలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో భారత బ్యాటర్లు నిలదొక్కుకుంటే ఈ లక్ష్యం మరీ పెద్దదేమీ కాకపోవచ్చు. అయితే ప్రపంచంలోనే అత్యధిక రన్ ఛేజ్ రికార్డు మాత్రం సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియా విధించిన 434 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 438 పరుగులు చేసి ఛేదించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు భారత్ కూడా అదే పట్టుదలతో ఈ 338 పరుగుల వేటను మొదలుపెట్టనుంది.
