W,W,W,W,W,W,W,W,W.. 3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. బౌలర్ కాదు ప్రత్యర్థుల పాలిట యముడు..

Lowest Score in T20 Cricket: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సాధారణంగా బ్యాటర్ల రాజ్యంగా భావించే టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్ విశ్వరూపం ప్రదర్శించి తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రత్యర్థి జట్టును కేవలం 13 పరుగులకే ఆలౌట్ చేసి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రికార్డుల గణిని మార్చివేసిన ఈ అద్భుత ఘనత ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్ అయింది.

W,W,W,W,W,W,W,W,W.. 3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. బౌలర్ కాదు ప్రత్యర్థుల పాలిట యముడు..
Lowest Score In T20 Cricket

Updated on: Apr 10, 2026 | 6:22 PM

Lowest Score in T20 Cricket: అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో బ్రెజిల్ వర్సెస్ లెసోతో జట్ల మధ్య జరిగిన పోరు ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. బ్రెజిల్ జట్టుకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ లారా కార్డోసో బంతితో నిప్పులు చెరిగింది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒక బౌలర్ గరిష్టంగా నాలుగు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉన్నప్పటికీ, లారా చూపిన తెగువ అమోఘం.

3 ఓవర్లు.. 4 పరుగులు.. 9 వికెట్లు..

లారా కార్డోసో గణాంకాలు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మ్యాచ్‌లో ఆమె కేవలం 3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసింది. అందులో రెండు మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం. కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి జట్టులోని తొమ్మిది మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపింది. మిగిలిన ఒక్క వికెట్‌ను మరియాన్ ఆర్తుర్ తన కోటాలో రెండో బంతికే సాధించడంతో లెసోతో ఇన్నింగ్స్ ముగిసింది. టీ20 క్రికెట్‌లో ఐదు వికెట్లు తీయడమే గగనమనుకుంటే, ఏకంగా తొమ్మిది వికెట్లు తీసి లారా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.

13 పరుగులకే ప్రత్యర్థి జట్టు కకావికలం..

మొదట బ్యాటింగ్ చేసిన బ్రెజిల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్థాయిలో 202 పరుగులు సాధించింది. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లెసోతో జట్టు బ్రెజిల్ బౌలర్ల దాటికి నిలబడలేకపోయింది. కేవలం 6.2 ఓవర్లలోనే 13 పరుగుల వద్ద ఆ జట్టు ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. లెసోతో జట్టులో ఏ ఒక్క క్రీడాకారిణి కూడా రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోయింది. మరీ దారుణంగా ఎనిమిది మంది బ్యాటర్లు సున్నా పరుగులకే అవుట్ కావడం గమనార్హం.

రికార్డుల వేటలో బ్రెజిల్ మహిళలు..

అంతర్జాతీయ మహిళల టీ20లలో అతి తక్కువ స్కోరు నమోదైన జాబితాలో లెసోతో చేసిన 13 పరుగులు ప్రస్తుతం ఏడవ స్థానంలో నిలిచాయి. గతంలో మాల్దీవులు, మాలి వంటి జట్లు కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ అయిన రికార్డులు ఉన్నప్పటికీ, ఒకే బౌలర్ తొమ్మిది వికెట్లు తీయడం మాత్రం ఇదే ప్రథమం. బ్రెజిల్ సాధించిన ఈ అద్భుత విజయంతోపాటు లారా కార్డోసో నెలకొల్పిన ప్రపంచ రికార్డు క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us