భారత జట్టు 22న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను ప్రారంభించనుంది. ఈ సిరీస్‌పై అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో మరో టెస్ట్ సెంచరీ సాధించాలని ఆకాంక్షించాడు. ఇది కోహ్లీకి ఆస్ట్రేలియాలో చివరి టూర్ అయ్యే అవకాశమందని ఆయన గుర్తు చేశాడు. “ఆస్ట్రేలియాలో కోహ్లీపై భారీ ఒత్తిడి ఉంటుంది, కానీ ఇది అతనికి అవసరమైన ఉత్తేజాన్ని ఇస్తుందా లేదా అతను ఈ ఒత్తిడిని అధిగమించగలడా అన్నది చూడాలి. గతంలో కోహ్లీని ప్రత్యర్థిగా చూసిన నేను, ఇప్పుడు అతన్ని అభిమానిగా చూస్తూ, అతని ద్వారా మరో టెస్ట్ సెంచరీ ఆశిస్తున్నాను” అని జాన్సన్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు.
సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్ల తరువాత కోహ్లీ భారత జట్టులో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఫిట్నెస్ సంస్కృతిని తీసుకొచ్చాడని జాన్సన్, కొనియాడాడు. కోహ్లీ ధోరణి జట్టులో ఇతర ఆటగాళ్లపై సానుకూల ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. “కోహ్లీ తన గత ఫామ్‌ను అందుకుంటాడని నేను నమ్ముతున్నాను. అతని కసి, ఆటపై ఉన్న అభిరుచి ఈ సిరీస్‌లో బయటకు వస్తాయని ఆశిస్తున్నాను,” అని జాన్సన్ తెలిపారు.
ఆస్ట్రేలియా-భారత్ టెస్టు సిరీస్ క్రికెట్ అభిమానులకు పండుగగా ఉంటుందని, రెండు జట్లు చాలా మంచి పోటీ వాతావరణంలో తలపడతాయని జాన్సన్ అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాలో కోహ్లీ రికార్డు: విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అసాధారణ ప్రదర్శనలు కనబరిచాడు. 25 టెస్ట్ ఇన్నింగ్స్‌లో 54.08 సగటుతో 1,352 పరుగులు చేసిన కోహ్లీ, 6 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు. కానీ ఇటీవల కోహ్లీ టెస్ట్ ఫామ్ సాధారణంగా ఉన్నది. 2020 తర్వాత కేవలం 2 సెంచరీలు మాత్రమే చేశాడు. 2024లో ఇప్పటివరకు ఆడిన ఆరు టెస్టుల్లో ఒకే అర్థ శతకం నమోదయ్యింది.
ఆస్ట్రేలియాలో మరో టెస్ట్ సెంచరీ సాధించడం కోహ్లీకి సవాలుగా మారింది. అతని ఫామ్, కెరీర్ గణాంకాలపై విమర్శలు ఉండవచ్చు. అయితే, కోహ్లీ ఓటమిని స్వీకరించని ఆటగాడు. ఈ సిరీస్‌లో అతను తన అదృష్టాన్ని మార్చుకోగలడా అన్నది భారత అభిమానులకు ఆసక్తికరమైన ప్రశ్న.
“కోహ్లీ అంటే ఆత్మవిశ్వాసానికి ప్రతీక, టీమ్‌కు రక్షణ కవచం,” అని మిచెల్ జాన్సన్ తన కాలమ్‌ను ముగించారు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ తో అభిమానులను అలరించగలడా? అనే ప్రశ్నకు సమాధానం ఈ సిరీస్ లో రానుంది.