
Star All-Rounder Washington Sundar Set to Recover Before T20 World Cup 2026: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా సైడ్ స్ట్రెయిన్ గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్, ప్రస్తుతం కోలుకునే ప్రక్రియలో ఉన్నాడు. తాజా నివేదికల ప్రకారం, ఆయన ఇప్పటికే బ్యాటింగ్ ప్రారంచినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో బౌలింగ్ కూడా మొదలుపెట్టనున్నాడు. స్వల్పంగా ఎముక చిట్లినట్లు మొదట గుర్తించినప్పటికీ, అది పెద్ద సమస్య కాదని, షెడ్యూల్ ప్రకారమే నయమవుతుందని వైద్య నిపుణులు ధృవీకరించారు.
సూపర్ 8 లక్ష్యంగా వ్యూహాలు.. ఫిబ్రవరి 7న అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు సుందర్ అందుబాటులో ఉండటం అనుమానమే అయినప్పటికీ, మేనేజ్మెంట్ ఆయనను జట్టుతోనే ఉంచాలని నిర్ణయించింది. జట్టులో ఉన్న ఏకైక స్పెషలిస్ట్ ఆఫ్-స్పిన్నర్ కావడంతో, టోర్నీ సెకండాఫ్ (సూపర్ 8) లో ఆయన పాత్ర అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నప్పుడు పవర్ ప్లేలో సుందర్ బౌలింగ్ టీమ్ ఇండియాకు ప్రధాన అస్త్రం.
తిలక్ వర్మ ఫిట్‌నెస్ అప్‌డేట్.. మరోవైపు యువ బ్యాటర్ తిలక్ వర్మ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ముంబైలో జట్టుతో కలిసే అవకాశం ఉంది. ప్రపంచకప్ కంటే ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్‌లకు ఆయన అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వైద్య సిబ్బంది క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే తిలక్ వర్మ వరల్డ్ కప్ సన్నాహాల్లో పాల్గొంటాడు.
జట్టు సమతుల్యతలో సుందర్ కీలకం.. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మధ్య ఓవర్లలో రాణిస్తున్నా, పవర్ ప్లేలో పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీయగల సామర్థ్యం వాషింగ్టన్ సుందర్ సొంతం. అంతేకాకుండా, లోయర్ ఆర్డర్‌లో ఆయన అందించే బ్యాటింగ్ లోతు జట్టుకు అదనపు బలాన్నిస్తుంది. రియాన్ పరాగ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, సుందర్ 100 శాతం ఫిట్‌గా లేకపోయినా ఆయనను జట్టులో కొనసాగించడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది.
బీసీసీఐ వైద్య బృందం సుందర్ విషయంలో ఎటువంటి తొందరపాటు ప్రదర్శించడం లేదు. అధికారిక వార్మప్ మ్యాచ్‌లు మిస్ అయినా, టోర్నీ ప్రారంభం నాటికి ఆయన జట్టుతో కలుస్తారు. సూపర్ 8 వంటి హై-స్టేక్స్ మ్యాచుల్లో సుందర్ ఉనికి భారత్‌కు కలిసొచ్చే అంశం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..