
BCCI New Rule : ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో ఉండే ఆటగాళ్ల కదలికలపై ఉక్కుపాదం మోపింది. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో జరిగిన ఒక సంఘటనను బేస్ చేసుకుని, క్రమశిక్షణను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చింది.
సన్‌రైజర్స్ మ్యాచ్ ఎఫెక్ట్?
గత కొన్ని మ్యాచ్‌లలో ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో ఆవేశ్ ఖాన్ వంటి ప్లేయర్లు బౌండరీ లైన్ వెలుపల చేసిన అతి ఉత్సాహం, గందరగోళం బీసీసీఐ దృష్టికి వెళ్ళింది. డగౌట్‌లో ఉండాల్సిన ప్లేయర్లు, మ్యాచ్ గెలవగానే లేదా వికెట్ పడగానే బౌండరీ లైన్ లోపలికి పరిగెత్తుకు రావడం, యాడ్ బోర్డుల దగ్గర గుంపులుగా తిరగడం వల్ల మ్యాచ్ నిర్వహణకు ఆటంకం కలుగుతోందని బోర్డు భావించింది. దీనివల్ల ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లకు, అంపైర్లకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొత్త రూల్ ఏంటి?
బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం.. మ్యాచ్ కోసం ప్రకటించిన 16 మంది ఆటగాళ్ల జాబితాలో లేని వారు ఎవరూ మైదానంలోకి అడుగుపెట్టకూడదు. గతంలో స్క్వాడ్‌లో ఉన్న ఎవరైనా డ్రింక్స్ తీసుకురావడం లేదా మెసేజ్ పంపడం చేసేవారు. కానీ ఇకపై కేవలం ఆ 16 మందిలో ఉన్నవారే (సబ్సిట్యూట్స్) మైదానంలోకి వెళ్లాలి. మిగిలిన ఆటగాళ్లందరూ ఖచ్చితంగా డగౌట్‌కే పరిమితం కావాలి.
బిబ్స్ ధరించడం తప్పనిసరి
కేవలం ఐదుగురు సబ్సిట్యూట్ ప్లేయర్లకు మాత్రమే బౌండరీ లైన్ వద్ద బిబ్స్ వేసుకుని తిరిగే అనుమతి ఉంటుంది. వారు కూడా బౌండరీ రోప్, ఎల్‌ఈడీ అడ్వర్టైజింగ్ బోర్డుల మధ్యలో ఇష్టమొచ్చినట్టు తిరగడానికి వీల్లేదు. నిర్దేశించిన స్థలంలోనే కూర్చోవాలి. డ్రింక్స్ ఇచ్చే సమయంలో కూడా అంపైర్ల అనుమతి తప్పనిసరి అని క్లాజ్ 11.5.2 స్పష్టం చేస్తోంది.
RISHABH PANT FINISHED IN STYLE 🔥
What Avesh Khan doing? 😂pic.twitter.com/i8mkSbGrpr
— Cricket Central (@CricketCentrl) April 5, 2026
క్రమశిక్షణ కోసమే ఈ చర్యలు
ఐపీఎల్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న లీగ్. ఇక్కడ ప్రతి సెకను విలువైందే. ఆటగాళ్లు అనవసరంగా గ్రౌండ్‌లోకి రావడం వల్ల సమయం వృథా అవ్వడమే కాకుండా, వ్యూహాలను పంచుకోవడంలో అక్రమాలకు తావిచ్చినట్లు అవుతుందని విమర్శలు ఉన్నాయి. అందుకే మ్యాచ్ ప్లేయింగ్ కండిషన్స్‌లోని క్లాజ్ 24.1.4కు అదనపు మార్పులు చేస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జట్లు భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..