Women IPL: మహిళల ఐపీఎల్‌పై గంగూలీ కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎలా నిర్వహించనున్నారంటే?
Women IPL: టీమిండియా తరపున ఆడే పురుషులను ఏ లీగ్‌లో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించడం లేదు. కానీ మహిళలు కచ్చితంగా ఇతర దేశాల టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు అనుమతి ఉంది.
Sourav Ganguly: మహిళల టీ20 ఛాలెంజ్ ట్రోఫీ(Women Challengers Trophy) ప్రారంభమైనప్పటి నుంచి చాలా మంది మాజీ క్రికెటర్లతోపాటు ఫ్యాన్స్ మహిళల ఐపీఎల్‌ని ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దీనిపై తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక అప్‌డేట్ అందించారు. ఈసారి కూడా మేలో మరోసారి ఉమెన్స్ ఛాలెంజర్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రానున్న కాలంలో మహిళల ఐపీఎల్(Women IPL) ను కూడా నిర్వహిస్తామని గంగూలీ స్పష్టం చేశారు. అదే సమయంలో రాబోయే కాలంలో టీమ్ ఇండియా ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుందని కూడా ప్రకటించారు.
టీమిండియా తరపున ఆడే పురుషులను ఏ లీగ్‌లో పాల్గొనడానికి బీసీసీఐ అనుమతించడం లేదు. కానీ మహిళలు కచ్చితంగా ఇతర దేశాల టీ20 లీగ్‌లలో పాల్గొనేందుకు అనుమతి ఉంది. అలాగే అక్కడ పాల్గొని తమ ప్రతిభను మరింత పదును పెట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వహించే బీబీఎల్ నుంచి న్యూజిలాండ్ సూపర్ లీగ్ వరకు, భారత మహిళా క్రీడాకారులు కనిపించి సందడి చేస్తున్నారు.
త్వరలో మహిళల ఐపీఎల్.. భారతదేశంలో మహిళల ఐపీఎల్‌కు చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ, ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి కచ్చితమైన ప్రణాళికను వెల్లడించలేదు. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్ దీని గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చారు. ‘టీమిండియా ఉమెన్స్ రాబోయే కాలంలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. మేం ఐపీఎల్‌ని నిర్వహిస్తాం. రాబోయే కాలంలో మహిళల ఐపీఎల్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మహిళా క్రీడాకారుల సంఖ్య పెరిగినప్పుడే ఇది జరుగుతుంది. ఈ ఏడాది కూడా ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమయంలోనే మహిళల ఛాలెంజర్స్ ట్రోఫీని నిర్వహించనున్నామంటూ’ తెలిపారు.
మహిళల ఐపీఎల్‌పై తొలి ప్రకటన.. గత ఏడాది చివర్లో కూడా సౌరవ్ గంగూలీ మహిళల ఐపీఎల్‌ను త్వరలో నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌తో ప్రత్యేక సంభాషణలో, ‘మా మనస్సులో మహిళల ఐపీఎల్ ఉంది. మేం దాని ముసాయిదాపై పని చేస్తున్నాం. రాబోయే మూడు-నాలుగు నెలల్లో దీని గురించి కీలక ప్రకటనలు రాబోతున్నాయి. ఈ టోర్నమెంట్ ఎలా రూపుదిద్దుకుంటుందో త్వరలో తెలియజేస్తాం. త్వరలో ఈ మహిళల ఐపీఎల్ ప్రారంభం అవుతుందని, విదేశీ ఆటగాళ్లను కూడా ఆహ్వానించాలని అనుకుంటున్నాం. తద్వారా వారు తమ అనుభవాన్ని మన దేశీయ ఆటగాళ్లతో కూడా పంచుకోగలరు’ అని ప్రకటించారు.
మహిళల ఐపీఎల్‌పై జైషా ఏమన్నాడంటే..! ఇదే సమయంలో బీసీసీఐ సెక్రటరీ జైషా ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మహిళల టీ20 ఛాలెంజ్‌లో అభిమానుల నుంచి ఎంతో ఉత్సాహం ఉందని, ఇది ఉత్తేజకరమైన విషయమని ఆయన అన్నారు. మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ లాంటి లీగ్ జరగాలని మనమందరం కోరుకుంటున్నాం. అయితే మూడు-నాలుగు జట్లను కూడగట్టుకుని మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడం కాదు. ఇందులో చాలా జట్టు ఏర్పడితేనే ఇది నిర్వహించడం సాధ్యమవుతుంది’ అని ఆయన అన్నారు.
Also Read: IND vs WI: గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. అహ్మదాబాద్‌లో రికార్డుల మోత.. తాజాగా టీమిండియా కూడా..