- Telugu News Photo Gallery Cricket photos IND vs WI: Ahmedabad Stadium to witness yet another first record in Cricket History after Gavaskar, Kapil and Sachin's records
IND vs WI: గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. అహ్మదాబాద్‌లో రికార్డుల మోత.. తాజాగా టీమిండియా కూడా..
Narendra Modi Stadium: మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1983లో అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. అప్పటి నుంచి ప్రపంచ క్రికెట్‌లో అతిపెద్ద రికార్డులు సృష్టించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.
Updated on: Feb 03, 2022 | 11:13 AM

ఫిబ్రవరి 6 నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (గతంలో మోటేరా స్టేడియం)లో జరుగుతాయి. ఈ మైదానం భారతదేశానికి ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ప్రపంచ క్రికెట్‌లో కీలక మైలురాళ్లు టీమిండియా ఆటగాళ్లకు సొంతమయ్యాయి. అవికూడా మొదటిసారిగా వారి ఖాతాలో చేరాయి. ఫిబ్రవరి 6న టీమిండియా మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. (ఫోటో: BCCI)

సునీల్ గవాస్కర్: భారత గ్రేట్ ఓపెనర్ గవాస్కర్ 1986-97లో ఈ మైదానంలో పాకిస్థాన్‌పై 10,000 టెస్ట్ పరుగులను పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అందుకున్న ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. (ఫోటో: ఫైల్)

గవాస్కర్ రికార్డు 7 సంవత్సరాల తర్వాత దిగ్గజ భారత ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మరో రికార్డు సాధించాడు. భారత మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ కపిల్ 1994లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే ఈ వికెట్‌తో అతను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మేరకు కపిల్ న్యూజిలాండ్ పేసర్ రిచర్డ్ హ్యాడ్లీ (431)ను దాటేశాడు. విశేషమేమిటంటే.. 1983లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు ఆడినప్పుడు కపిల్ ఒక ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టడం ఈ మైదానంలో ఇప్పటి వరకు అత్యుత్తమ బౌలింగ్‌గా రికార్డు సృష్టించింది. (ఫోటో: ఫైల్/AFP)

కొన్నేళ్ల తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఈ గడ్డపై రికార్డులు సృష్టించాడు. 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 30 వేల పరుగులు పూర్తి చేశాడు. అతను ప్రపంచంలోనే మొదటి, ఇప్పటివరకు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2011 ప్రపంచకప్ సమయంలో, ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో 18,000 పరుగులు కూడా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా సచిన్ కావడం విశేషం. (ఫోటో: ఫైల్/AFP)

ప్రస్తుతం భారత జట్టు గురించి మాట్లాడుకుంటే.. ఫిబ్రవరి 6న ఈ మైదానంలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడినప్పుడు 1000 వన్డేలు ఆడిన ప్రపంచంలోనే తొలి జట్టుగా అవతరిస్తుంది. ఆస్ట్రేలియా (958) రెండో స్థానంలో ఉంది. (ఫోటో: BCCI)




