AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pragyan Ojha: ఒడిశాలో పుట్టి హైదరాబాద్‌లో ఎదిగిన క్రికెటర్.. ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్

Pragyan Ojha: బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీకి ప్రగ్యాన్ ఓజా కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అజిత్ అగార్కర్ స్థానంలో వచ్చిన మార్పులతో పాటు రమేశ్ పవార్‌కు కమిటీలో చోటు దక్కింది. అత్యధిక టెస్టులు ఆడిన అనుభవం ఆధారంగా ఓజాను చీఫ్ సెలెక్టర్‌గా ఎంపిక చేశారు.

Pragyan Ojha: ఒడిశాలో పుట్టి హైదరాబాద్‌లో ఎదిగిన క్రికెటర్.. ఇప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్
Pragyan Ojha
Rakesh
|

Updated on: Oct 19, 2026 | 5:44 PM

Share

Pragyan Ojha: భారత క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా పురుషుల సెలక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా బాధ్యతలు చేపట్టనున్నారు. మరోవైపు మాజీ క్రికెటర్ రమేశ్ పవార్‌కు సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ అక్టోబర్ 19న అధికారికంగా ప్రకటించింది. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఈ మార్పులు జరిగాయి. అయితే కొత్త కమిటీలో పవార్ సభ్యుడిగా చేరినా.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు మాత్రం ఓజాకే దక్కాయి.

టెస్టుల అనుభవం ఓజాకు ప్లస్ పాయింట్

ప్రజ్ఞాన్ ఓజాను సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేయడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. కమిటీలోని ఐదుగురు సభ్యుల్లో అత్యధికంగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడికి సీనియారిటీ ఆధారంగా చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ లెక్కన ఓజా 24 టెస్టులతో మిగతా సభ్యుల కంటే ముందున్నారు. అందుకే ఆయనకు చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు దక్కాయి. సెలక్షన్ కమిటీ చైర్మన్‌ను సభ్యుల ఓటింగ్ ద్వారా ఎంపిక చేయలేదని, టెస్టు మ్యాచ్‌ల అనుభవం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని బీసీసీఐ స్పష్టం చేసింది. 40 ఏళ్ల వయసులో ఈ బాధ్యతలు చేపట్టనున్న ఓజా, భారత జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నారు.

హైదరాబాద్ తో అనుబంధం

ప్రగ్యాన్ ఓజా 1986 సెప్టెంబర్ 5న భువనేశ్వర్‌లో జన్మించారు. ఆయనకు 13–14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం హైదరాబాద్‌కు మారింది. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి చూపిన ఓజా, ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. హైదరాబాద్ దేశవాళీ జట్టు తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2006–07 రంజీ ట్రోఫీ సీజన్‌లో కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే 29 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ ప్రదర్శనే ఆయన భారత జట్టులోకి వెళ్లేందుకు బలమైన పునాది వేసింది.

రమేశ్ పవార్‌కు దక్కిన అవకాశం

రమేశ్ పవార్‌ను పురుషుల సెలక్షన్ కమిటీలో కొత్త సభ్యుడిగా నియమించేందుకు క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. దరఖాస్తులను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం పవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఆయన భారత జట్టు తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచింగ్ రంగంలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. భారత మహిళల జట్టుతో పాటు ముంబై, గుజరాత్ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు.

కొత్త సెలక్షన్ కమిటీలో ఎవరెవరున్నారు?

ప్రజ్ఞాన్ ఓజా నేతృత్వంలో ఏర్పాటైన పురుషుల సెలక్షన్ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారు. చైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా వ్యవహరించనుండగా, శివ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేశ్ పవార్ సభ్యులుగా కొనసాగనున్నారు. వీరంతా కలిసి టీమిండియా సీనియర్ పురుషుల జట్టు ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్, దేశవాళీ క్రికెట్ ప్రదర్శనలు, అంతర్జాతీయ అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జట్ల ఎంపికలో పాల్గొననున్నారు.

అగార్కర్ సేవలను ప్రశంసించిన బీసీసీఐ

2023 జూలైలో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత క్రికెట్ జట్టు పలు కీలక విజయాలు సాధించింది. ఆయన నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమయంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు గెలిచిందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ అగార్కర్ సేవలను ప్రశంసించింది. ఇప్పుడు కొత్త చైర్మన్‌గా ప్రజ్ఞాన్ ఓజా, కొత్త సభ్యుడిగా రమేశ్ పవార్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. రాబోయే సిరీస్‌లకు భారత జట్టు ఎంపికపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us