
BCCI Chief Selector: వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియనుంది. ఈ సెప్టెంబర్‌తో అగార్కర్ కాలపరిమితి పూర్తి కానుండటంతో, నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులు చాలా మందే ఉన్నప్పటికీ, మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రేసులో అందరికంటే ముందున్నాడనే కథనాలు వస్తున్నాయి. బీసీసీఐ కూడా అగార్కర్ స్థానంలో మాజీ ఆఫ్ స్పిన్నర్ అయిన అశ్విన్‌కు బాధ్యతలు అప్పగించనుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీనియర్లను పక్కన పెట్టేసి, కుర్రాళ్లకు పెద్ద పీట వేయడంతో పాటు, స్క్వాడ్ ఎంపిక కూడా అస్సలు బాగుండడం లేదనే ఆరోపణలు ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్‌లో ఎదురైన ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అగార్కర్ పని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పదవీకాలం ముగింపు దశలో ఉన్న అగార్కర్‌ను పొడిగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, అప్పుడే అగార్కర్ వారసుడు ఎవరు అనే చర్చ మొదలైంది. మరో నెల రోజుల్లో చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ పదవీకాలం ముగియనుండటంతో, కాబోయే ప్రధాన సెలెక్టర్ ఎవరు? పోటీలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అగార్కర్ తర్వాత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చీఫ్ సెలెక్టర్ పదవిని చేపట్టే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027 ముందే అశ్విన్ నియామకం జరుగుతుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీంతో ఒక్కసారిగా అశ్విన్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్నాడు. రిటైర్మెంట్ తర్వాత సొంత యూట్యూబ్ ఛానెల్‌లో క్రికెట్ విశ్లేషణలు చేస్తున్న స్పిన్ దిగ్గజం మాత్రం ఈ వైరల్ వార్తలపై ఇంకా స్పందించలేదు. బీసీసీఐ సైతం అగార్కర్ మార్పుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..