
Cricket Coaching : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దేశీయ క్రికెట్ అభివృద్ధి కోసం మరో కీలక అడుగు వేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ )లో కోచింగ్ బాధ్యతల కోసం 10 మంది భారత మాజీ క్రికెటర్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ పేసర్, ధోనీ నమ్మకస్థుడైన లక్ష్మీపతి బాలాజీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశీ కోచ్‌ల విధానానికి స్వస్తి పలికి, స్వదేశీ నిపుణులకే పెద్దపీట వేయాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.
గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ట్రాయ్ కూలీ ఇక్కడ బౌలింగ్ కోచ్‌గా ఉండేవారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ కోచ్ స్టెఫాన్ జోన్స్‌తో బీసీసీఐ చర్చలు జరిపింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ డీల్ కుదరలేదు. దీంతో భారత ఆటగాళ్లకు మన దేశ పరిస్థితులు బాగా తెలిసిన మన కోచ్‌లే బెటర్ అని భావించిన బోర్డు, కేవలం భారతీయులనే నియమించాలని ఫిక్స్ అయింది. లక్ష్మీపతి బాలాజీతో పాటు పంజాబ్ కింగ్స్ మాజీ పేసర్ వి.ఆర్.వి సింగ్ కూడా బౌలింగ్ కోచ్‌ల జాబితాలో ఉన్నారు.
లక్ష్మీపతి బాలాజీకి ఐపీఎల్‌లో ఘనమైన చరిత్ర ఉంది. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే సీఎస్‌కే తరఫున హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు సృష్టించిన బాలాజీ, ఎంఎస్ ధోనీకి అత్యంత నమ్మకమైన బౌలర్‌గా గుర్తింపు పొందారు. కేవలం ఆటగాడిగానే కాకుండా, 2018 నుండి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ఆయనకున్న ఈ అనుభవం భారత్‌లోని యువ బౌలర్లను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీసీఐ నమ్ముతోంది.
కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలకు కూడా కొత్త కోచ్‌లను ఎంపిక చేశారు. కర్ణాటక మాజీ ఆటగాడు యెరే గౌడ్ బ్యాటింగ్ కోచ్‌గా, రాజస్థాన్ రాయల్స్ మాజీ సభ్యుడు దిశాంత్ యాగ్నిక్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వీరితో పాటు జమ్మూ కాశ్మీర్ రంజీ కోచ్ పి.కృష్ణకుమార్, భారత మహిళా జట్టు మాజీ క్రీడాకారిణి సునేత్రా పరంజపే కూడా ఈ పది మంది కోచ్‌ల బృందంలో ఉండనున్నారు. వీరంతా బెంగళూరు వేదికగా భారత భవిష్యత్తు క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..