
R Ashwin : వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ రూపొందించిన షెడ్యూల్, టోర్నమెంట్ ఫార్మాట్‌పై అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈసారి వరల్డ్ కప్ చూడటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చని కుండబద్దలు కొట్టారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని ఐదు గ్రూపులుగా విభజించారు. భారత్ ఉన్న గ్రూప్-ఎ లో పాకిస్థాన్ మినహా మిగిలిన జట్లు అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లు కావడంపై అశ్విన్ మండిపడ్డారు. “ఈ వరల్డ్ కప్ ఎవరూ చూడరు. భారత్-అమెరికా, భారత్-నమీబియా వంటి వన్ సైడ్ మ్యాచ్‌లు అభిమానులను టోర్నమెంట్‌కు దూరం చేస్తాయి. సూపర్-8 దశకు వచ్చేసరికి ప్రేక్షకులు పూర్తిగా బోర్ ఫీల్ అవుతారు” అని అశ్విన్ విశ్లేషించారు.
తమ చిన్నతనంలో వరల్డ్ కప్ అంటే ఉండే క్రేజ్ ఇప్పుడు లేదని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. “1996, 1999, 2003 వరల్డ్ కప్స్ సమయంలో మేము స్కూల్ లో ఉండేవాళ్లం. అప్పుడు షెడ్యూల్ కార్డులు సేకరించి దాచుకునేవాళ్లం. ఎందుకంటే అప్పట్లో నాలుగేళ్లకు ఒకసారి టోర్నీ వచ్చేది, చాలా స్పెషల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఏటా ఏదో ఒక వరల్డ్ కప్ వస్తోంది, దాని విలువ పోయింది” అని ఆయన అభిప్రాయపడ్డారు. మొదట్లోనే భారత్, ఇంగ్లాండ్ లేదా శ్రీలంక వంటి జట్ల మధ్య మ్యాచ్‌లు ఉంటే టోర్నీకి హైప్ వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
కేవలం టీ20 వరల్డ్ కప్ మాత్రమే కాదు, వన్డే క్రికెట్ మనుగడపై కూడా అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. అభిమానులంతా టీ20ల వైపు మళ్లుతున్నారని, టెస్టులకు కొంతమంది మద్దతు ఉన్నప్పటికీ వన్డేల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ఐసీసీ ఈ విషయంలో పునరాలోచించకపోతే వన్డే క్రికెట్ తన అస్తిత్వాన్ని కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు.