
IND vs SL 1st Test: శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు కోసం భారత తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. జట్టులో సీనియర్ ఆటగాడిని పక్కనపెట్టి ఏకంగా ఓ కొత్త కుర్రాడికి అవకాశం ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శనివారం గాలే మైదానంలో శ్రీలంకతో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ తుది కూర్పుపై కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్ తాను ఎంచుకున్న తుది జట్టును అభిమానులతో పంచుకున్నాడు. అశ్విన్ ఎంచుకున్న జట్టులో అందరినీ విస్మయానికి గురిచేసిన ప్రధాన అంశం ఫాస్ట్ బౌలింగ్ విభాగం. సాధారణంగా తొలి టెస్టు అనగానే అనుభవానికి పెద్దపీట వేస్తారు. ఈ లెక్కన మహమ్మద్ సిరాజ్ కు జోడీగా అనుభవజ్ఞుడైన ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగుతాడని అంతా భావించారు. కానీ అశ్విన్ మాత్రం సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను పక్కనపెట్టి పెద్ద సాహసమే చేశాడు. అతని స్థానంలో పంజాబ్ నుంచి వచ్చిన ఆరడుగుల యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాడు. గాలే పిచ్‌పై క్రాస్ విండ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో గుర్నూర్ బ్రార్ తన ఎత్తును వాడుకుని అదనపు బౌన్స్ రాబట్టగలడని అశ్విన్ గట్టిగా నమ్ముతున్నాడు. అద్భుతమైన దేశవాళీ రికార్డు ఉన్న బ్రార్, కచ్చితంగా ఈ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తాడని అతను జోస్యం చెప్పాడు.
మిడిలార్డర్ బ్యాటింగ్ కూర్పులో కూడా అశ్విన్ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చినా.. అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని అశ్విన్ తేల్చి చెప్పాడు. ఉపఖండపు పిచ్‌లపై స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సర్ఫరాజ్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ, అశ్విన్ మాత్రం యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ వైపే మొగ్గు చూపాడు. విపత్కర పరిస్థితుల్లో, తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడే తత్వం జురెల్ సొంతమని, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు అతడే సరైన ఎంపిక అని స్పష్టం చేశాడు. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో క్లాసిక్ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రానుండగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఓపెనర్లుగా డాషింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించడం దాదాపు ఖాయమే. ఇక ఐదో స్థానంలో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆడనున్నాడు.
స్పిన్ విభాగానికి వస్తే, లంక బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడానికి అశ్విన్ ఓ పకడ్బందీ వ్యూహం రచించాడు. గాలే పిచ్ ఎప్పుడూ స్పిన్ కు స్వర్గధామం. అందుకే తుది జట్టులో ఏకంగా ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లకు చోటు కల్పించాడు. బ్యాటింగ్ తోనూ సత్తా చాటగల సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు యువ సంచలనం మానవ్ సుతార్ ను ఎంచుకున్నాడు. వీరికి తోడుగా స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నాడు. ఈ ముగ్గురు స్పిన్నర్లు గాలే పిచ్‌పై లంక బ్యాటర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..