భారత క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్‌గా పేరు గాంచిన వీరేంద్ర సెహ్వాగ్ తండ్రి స్ఫూర్తిగా అతని కుమారుడు ఆర్యవీర్ కూడా తన ప్రతిభతో మెరిసిపోతున్నాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న ఆర్యవీర్ తన డబుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 200 పరుగులతో నాటౌట్ గా నిలిచిన అతడు, తన ప్రతిభతో ఈ టోర్నమెంట్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
మేఘాలయతో జరిగిన ఈ మ్యాచ్‌లో 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 పరుగులు చేసిన ఆర్యవీర్ తన బాదుడుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసాడు. అర్ణవ్ బగ్గా (సెంచరీ) తో కలిసి 180 పరుగుల భాగస్వామ్యం అందించిన ఆర్యవీర్, ఢిల్లీ జట్టుకు చక్కని ఆధిక్యాన్ని అందించాడు. ధన్య నక్రా కూడా అజేయంగా 98 పరుగులు చేయడం జట్టు విజయానికి తోడ్పడింది.
అక్టోబర్‌లో వినూ మాంకడ్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఆర్యవీర్ అప్పుడే తన ప్రతిభను చాటుకున్నాడు. మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులు చేసి జట్టును విజయవంతంగా ముందుకు నడిపాడు. ఇప్పుడు, కూచ్ బెహార్ ట్రోఫీలో అతని అసాధారణ ప్రదర్శన అతడిని యువ క్రికెటర్లలో ప్రత్యేకంగా నిలబెట్టింది.
వీరేంద్ర సెహ్వాగ్ తన పిల్లలపై ఎటువంటి ఒత్తిడి ఉండదని 2019లోనే చెప్పాడు. తన కుమారుడు క్రికెటర్ కాకున్నా సరే, మంచి వ్యక్తిగా ఎదగడం ముఖ్యం అని అన్నాడు. అయితే, ప్రస్తుతం ఆర్యవీర్ ఐపీఎల్‌లో చోటు పొందేందుకు కృషి చేస్తున్నాడని ఈ ఏడాది సెహ్వాగ్ వెల్లడించాడు. యువతకు ఐపీఎల్ ఎంతగానో ప్రయోజనం చేకూర్చుతోందని, చిన్న రాష్ట్రాల నుండి కూడా గొప్ప ప్రతిభ ఉన్న ఆటగాళ్లు బయటకు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఆర్యవీర్ ఈ జోరును కొనసాగిస్తే, త్వరలోనే టీమిండియా జట్టులో చోటు సంపాదించడం ఖాయం. ప్రస్తుత టోర్నమెంట్ విజయంతో అతనిపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. “తగ్గేదేలే” అన్న మైండ్‌సెట్‌తో ఆటను కొనసాగిస్తే, ఆర్యవీర్ కూడా క్రికెట్ ప్రపంచంలో సెహ్వాగ్ వారసత్వాన్ని నిలబెట్టగలడని నమ్మకంతో ఉన్నారు.
🚨 DOUBLE HUNDRED FOR AARYAVIR SEHWAG 🚨
– Virender Sehwag's son Aaryavir scored 200* runs from just 229 balls including 34 fours & 2 sixes in Cooch Behar Trophy 🏆 pic.twitter.com/7twc2vDyhM
— Johns. (@CricCrazyJohns) November 21, 2024