Vaibhav Suryavanshi : సిక్సర్ల కింగ్ క్రిస్ గేల్‌కు సవాల్ విసిరిన వండర్ కిడ్.. ఏకంగా 200 పరుగులు కొడతానన్న వైభవ్

Vaibhav Suryavanshi : రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డుపై కన్నేశాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టి, తొలి డబుల్ సెంచరీ సాధించడమే తన లక్ష్యమని ప్రకటించాడు.

Vaibhav Suryavanshi : సిక్సర్ల కింగ్ క్రిస్ గేల్‌కు సవాల్ విసిరిన వండర్ కిడ్.. ఏకంగా 200 పరుగులు కొడతానన్న వైభవ్
Vaibhav Suryavanshi

Updated on: May 26, 2026 | 9:48 AM

Vaibhav Suryavanshi : ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త సంచలనానికి తెరలేపాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదడం అలవాటుగా మార్చుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, తాజాగా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛానెల్ ది స్విచ్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. హాఫ్ సెంచరీలు చేసినప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవు అని పీటర్సన్ అడగ్గా.. “నాకు యాభై రన్లు కొట్టడం పెద్దగా నచ్చదు.. T20 క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో మొట్టమొదటి డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధించడమే నా లక్ష్యం. వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నాను” అని అత్యంత ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చాడు.

ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. 2013 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ పూణే వారియర్స్ జట్టుపై గేల్ కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లోనే గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఈ 15 ఏళ్ల బీహార్ సంచలనం ఆ రికార్డును దాటి ఏకంగా డబుల్ సెంచరీ మార్కును అందుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు.

గతేడాది కేవలం 14 ఏళ్ల వయసులోనే అత్యంత పిన్న వయస్కుడిగా ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ్, ఈ సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా చెలరేగిపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడిన అతను 41.64 సగటుతో, ఏకంగా 232.27 స్ట్రైక్ రేట్‌తో 583 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ (అత్యధిక స్కోరు 103), మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధికంగా 53 సిక్సర్లు బాది, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును దాటడానికి వైభవ్ కేవలం 7 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే శతకం బాది, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 7 మ్యాచ్‌ల్లో 62.71 సగటుతో, 169.49 స్ట్రైక్ రేట్‌తో 439 పరుగులు చేసి టోర్నమెంట్‌లోనే రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ఏకంగా 30 సిక్సర్లు బాది, 2022లో సౌతాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (18 సిక్సర్లు) నెలకొల్పిన రికార్డును తుడిచిపెట్టేశాడు. అండర్-19 వన్డేల్లోనూ ఇండియా తరఫున 25 ఇన్నింగ్స్‌ల్లో 1,412 పరుగులు చేసి టాప్ రన్ గెట్టర్‌గా కొనసాగుతున్నాడు.

అక్టోబర్ 2024 నుంచి ఈ యువ లెఫ్ట్ హ్యాండర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై కేవలం 58 బంతుల్లోనే సెంచరీ బాది యూత్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయుడిగా నిలిచాడు. గతేడాది ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లో సెంచరీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగులు చేసి టోర్నీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరియన్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాదు, విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా సంచలనం సృష్టించాడు. రూ. 1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకున్న ఈ కుర్రాడు, తన మొదటి బంతికే సిక్స్ కొట్టి ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించి నేడు ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us