Archery World Cup : ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ సంచలనం.. రెండు బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన ధీరజ్

Archery World Cup : ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర రెండు స్వర్ణ పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత రికర్వ్, మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లో విజేతగా నిలిచి భారత ఆర్చరీకి కొత్త మైలురాయిని అందించాడు.

Archery World Cup :  ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ సంచలనం.. రెండు బంగారు పతకాలతో చరిత్ర సృష్టించిన ధీరజ్
Archery World Cup

Updated on: Jun 15, 2026 | 12:37 PM

Archery World Cup : భారత యువ ఆర్చరీ సంచలనం ధీరజ్ బొమ్మదేవర అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. తుర్కియేలోని అంటాల్యా వేదికగా జరిగిన ఐసీసీ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 టోర్నమెంట్‌లో ఈ 24 ఏళ్ల భారత ఆర్చర్ ఊహించని ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో ఏకంగా రెండు బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుని దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు. మొదట మిక్స్‌డ్ టీమ్ విభాగంలో, ఆ తర్వాత పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని డబుల్ సక్సెస్ సాధించాడు.

ఒలింపిక్ విజేతపై అద్భుత విజయం

పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో ధీరజ్ బొమ్మదేవర అసాధారణమైన ప్రతిభను కనబరిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్చర్లలో ఒకరైన దక్షిణ కొరియా ఒలింపిక్ కాంస్య పతక విజేత లీ వూ-సియోక్‎తో ధీరజ్ తలపడ్డాడు. క్లిష్టమైన ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా, అత్యంత ఖచ్చితత్వంతో బాణాలు సంధించి కొరియా ప్లేయర్‌ను 7-3 తేడాతో మట్టికరిపించాడు. ఆర్చరీ ప్రపంచకప్‌లో ధీరజ్‌కు ఇదే మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతకం కావడం విశేషం. అతని కెరీర్‌లో ఇది నాల్గవ అంతర్జాతీయ పతకం కాగా, గతంలో మూడుసార్లు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.

ఐదేళ్ల నిరీక్షణకు తెరదించిన ధీరజ్

ఈ చారిత్రాత్మక విజయంతో ధీరజ్ బొమ్మదేవర పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారతదేశానికి ఐదేళ్లుగా ఉన్న బంగారు పతకం నిరీక్షణకు తెరదించాడు. ఇంతకుముందు 2021లో భారత స్టార్ ఆర్చర్ అతాను దాస్ ఈ విభాగంలో స్వర్ణం గెలవగా, ఆ తర్వాత మళ్లీ పసిడి సాధించిన ఘనత ధీరజ్‌కే దక్కింది. అంతేకాకుండా, భారతదేశ ఆర్చరీ చరిత్రలో జయంత్ తాలూక్దార్, అతాను దాస్ తర్వాత ప్రపంచకప్ స్థాయిలో వ్యక్తిగత రికర్వ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న కేవలం మూడవ భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు.

సెమీఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ

నిజానికి ఫైనల్ చేరడానికి ముందు ధీరజ్ ఎదుర్కొన్న సెమీఫైనల్ మ్యాచ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపించింది. జర్మనీకి చెందిన బలమైన ఆర్చర్ మోరిట్జ్ వీజర్‎తో జరిగిన ఈ పోరులో ధీరజ్ ఒక దశలో 3-1 తేడాతో వెనుకబడ్డాడు. ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ, ధీరజ్ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. వరుస సెట్లలో అద్భుతమైన పాయింట్లు సాధించి 6-4 తేడాతో జర్మనీ ప్లేయర్‌పై ఘన విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ ఇచ్చిన బూస్టింగ్‌తోనే ఫైనల్లో కొరియా ప్లేయర్‌ను చేతులెత్తేసేలా చేశాడు.

కుమ్కుమ్ మోహోద్‌తో కలిసి మరో గోల్డ్ మెడల్

వ్యక్తిగత విభాగంలో రింగ్స్ బద్ధలు కొట్టడానికి ముందే ధీరజ్ తన గోల్డ్ మెడల్స్ జాతరను ప్రారంభించాడు. ఆదివారం ఉదయం జరిగిన రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో 17 ఏళ్ల భారత యువ ఆర్చర్ కుమ్కుమ్ మోహోద్‌తో కలిసి ధీరజ్ జోడీగా బరిలోకి దిగాడు. టోర్నమెంట్‌లో మూడో సీడ్‌గా ఉన్న ఈ భారత జంట ఫైనల్లో టాప్ సీడ్ దక్షిణ కొరియా జోడీ అయిన ఓహ్ యేజిన్, కిమ్ జె-డియోక్‌లను 5-1తో చిత్తు చేసింది. ఇందులో కొరియా ప్లేయర్ కిమ్ జె-డియోక్ టోక్యో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం గెలిచిన జట్టులో సభ్యుడు కావడం గమనార్హం.

భారత ఆర్చరీలో సరికొత్త మైల్‌స్టోన్

ధీరజ్ బొమ్మదేవర, కుమ్కుమ్ మోహోద్‌ల జోడీ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారతదేశపు మూడవ మిక్స్‌డ్ రికర్వ్ జోడీగా రికార్డు సృష్టించింది. గతంలో 2021లో దీపికా కుమారి-అతాను దాస్ జంట పారిస్‌లో, 2022లో తరుణ్‌దీప్ రాయ్-రిధి జోడీ అంటాల్యాలోనే ఈ ఘనత సాధించారు. 17 ఏళ్ల కుమ్కుమ్ మోహోద్‌కు ఇది వరుసగా రెండో ప్రపంచకప్ స్వర్ణం కావడం విశేషం. మొత్తానికి, ఈ అంటాల్యా టోర్నమెంట్ భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే పండగలాంటి టోర్నమెంట్‌గా నిలిచిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us