AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yogini Ekadashi: యోగిని ఏకాదశి ఎప్పుడు? పాప విముక్తిని ప్రసాదించే మహా వ్రతం.. ఈ పురాణ కథ తెలుసా?

Ekadashi Significance: జూలై నెలలో కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తితో ఆరాధించి ఉపవాసం ఆచరిస్తే పాప విముక్తి, శాప విమోచనం, ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. యోగిని ఏకాదశి 2026 తేదీ, వ్రత విధానం, హేమమాలి పురాణ కథ, విశేషాలను తెలుసుకోండి.

Yogini Ekadashi: యోగిని ఏకాదశి ఎప్పుడు? పాప విముక్తిని ప్రసాదించే మహా వ్రతం.. ఈ పురాణ కథ తెలుసా?
Yogini Ekadashi 2026
Rajashekher G
|

Updated on: Jul 05, 2026 | 10:21 AM

Share

హిందూ ధర్మంలో సంవత్సరమంతా వచ్చే 24 ఏకాదశులలో ప్రతి ఒక్కదానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. వాటిలో కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి అత్యంత పవిత్రమైనది, పాప విమోచనాన్ని ప్రసాదించే మహా వ్రతంగా పురాణాలు వర్ణించాయి. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి, ఉపవాసం ఆచరిస్తే తెలిసి, తెలియక చేసిన పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని శాస్త్ర విశ్వాసం.

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత

పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం వంటి పౌరాణిక గ్రంథాల్లో యోగిని ఏకాదశికి విశేషమైన స్థానం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని, తీవ్రమైన పాపాలు కూడా క్షీణిస్తాయని పేర్కొనబడింది.

పురాణాల ప్రకారం, యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. శాపాలు, దోషాలు, శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి పొందేందుకు ఈ వ్రతం ఎంతో శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. శ్రీహరిని భక్తితో పూజించి ఉపవాసం పాటించే వారి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి, శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

యోగిని ఏకాదశి 2026 తిథి

హిందూ పంచాంగం ప్రకారం కృష్ణ పక్ష ఏకాదశి తిథి 2026 జూలై 10 శుక్రవారం ఉదయం 8:16 గంటలకు ప్రారంభమై, జూలై 11, శనివారం ఉదయం 5:22 గంటలకు ముగుస్తుంది.

హరివాసర కాలం జూలై 11 ఉదయం 10:32 గంటల వరకు ఉంటుంది. సంప్రదాయ పంచాంగాల ప్రకారం, స్మార్త, వైష్ణవ సంప్రదాయాల్లో తిథి, హరివాసర కాలాన్ని అనుసరించి వ్రత ఆచరణలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. అందువల్ల, తమ కుటుంబ ఆచారం లేదా గురువులు సూచించిన విధంగా వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం.

యోగిని ఏకాదశి వ్రత విధానం

  • బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
  • శ్రీమహావిష్ణువు, శ్రీలక్ష్మీదేవిని పూజించాలి.
  • తులసీదళాలతో “ఓం నమో నారాయణాయ” లేదా “ఓం విష్ణవే నమః” మంత్రాలను జపించాలి.
  • రోజంతా ఉపవాసం ఉండి భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం లేదా గీతా పఠనం చేయడం శుభప్రదం.
  • మరుసటి రోజు ద్వాదశి తిథిలో నియమానుసారం పారణ చేసి, అవసరమైన వారికి అన్నదానం లేదా దానం చేయడం ఉత్తమంగా భావిస్తారు.

యోగిని ఏకాదశి పురాణ కథ

పురాణాల ప్రకారం, ఆలకాపురి రాజైన కుబేరుడు పరమశివుని గొప్ప భక్తుడు. ప్రతిరోజూ మానస సరోవరం నుండి సుగంధభరితమైన దివ్య పుష్పాలను తెప్పించి శివార్చన చేసేవాడు. ఆ బాధ్యతను అతని సేవకుడు హేమమాలి నిర్వహించేవాడు. ఒక రోజు హేమమాలి తన భార్య విశాలాక్షితో గడపడంలో మునిగిపోయి, శివపూజ కోసం తీసుకురావాల్సిన పుష్పాలను సమయానికి అందించలేకపోయాడు. శివారాధనలో జరిగిన ఈ నిర్లక్ష్యానికి ఆగ్రహించిన కుబేరుడు అతనిని శపించాడు. ఆ శాపం వల్ల హేమమాలి కుష్ఠు వ్యాధితో బాధపడుతూ, తన సౌందర్యాన్ని కోల్పోయి, అడవుల్లో దుర్భరమైన జీవితం గడపాల్సి వచ్చింది.

అనేక సంవత్సరాల తర్వాత హేమమాలి మహర్షి మార్కండేయుడిని ఆశ్రయించి తన బాధను వివరించాడు. అతని దుస్థితిని చూసిన మహర్షి.. యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాలని ఉపదేశించాడు. మహర్షి చెప్పిన విధంగా హేమమాలి శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రత ప్రభావంతో కుబేరుడి శాపం తొలగిపోయి, అతను తిరిగి తన ఆరోగ్యం, అందం, ఐశ్వర్యాన్ని పొందాడు. ఈ కారణంగానే యోగిని ఏకాదశిని పాప విముక్తిని ప్రసాదించే వ్రతం, కొత్త జీవితానికి నాంది పలికే పవిత్ర ఏకాదశిగా పురాణాలు కీర్తించాయి.

యోగిని ఏకాదశి సందేశం

యోగిని ఏకాదశి కేవలం ఉపవాసం మాత్రమే కాదు. ఇది మనస్సు, మాట, కర్మలను పవిత్రం చేసుకునే ఆధ్యాత్మిక సాధన. భక్తి, నియమం, ఆత్మపరిశీలనతో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని సనాతన ధర్మం బోధిస్తుంది. భగవంతుని కృపతో పాపబంధాలు తొలగి, జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక వికాసం కలగాలని యోగిని ఏకాదశి మనకు గుర్తు చేస్తుంది.

(Disclaimer: యోగిని ఏకాదశి వ్రత ఫలితాలు, పురాణ కథలు, విశేషాలు హిందూ పురాణాలు, ఆగమాలు, సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. ప్రాంతానుసారం పంచాంగం, ఆచారాలలో స్వల్ప తేడాలు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us