Yogini Ekadashi: రేపే యోగినీ ఏకాదశి.. విష్ణు పూజ.. ఉపవాసం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..

హిందూ మతంలో ఏకాదశి ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా జ్యేష్ఠ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి, పాపాలను నాశనం చేయడానికి, జీవితంలో ఆనందం, శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా.. 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది.

Yogini Ekadashi: రేపే యోగినీ ఏకాదశి.. విష్ణు పూజ.. ఉపవాసం సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..
Yogini Ekadashi 2025

Updated on: Jun 20, 2025 | 7:04 AM

జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజు ఉపవాసాన్ని భక్తితో ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం పొందుతాడని నమ్ముతారు. ఈ పవిత్ర ఏకాదశి ప్రాముఖ్యత, పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

2025 లో యోగిని ఏకాదశి ఎప్పుడు?
2025 సంవత్సరంలో, జూన్ 21, శనివారం నాడు యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి జూన్ 21న ఉదయం 7:18 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ తిథి జూన్ 22న ఉదయం 4:27 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయ తిథి ఆధారంగా జూన్ 21న యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు.

88 వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టడంతో సమానమైన ధర్మ రహస్యం
యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టినంత పుణ్యం పొందుతాడని పురాణాలలో ప్రస్తావించబడింది. ఈ ఉపవాసం ఫలితం ఎంత గొప్పదో, ప్రభావవంతమైనదో ఇది చూపిస్తుంది. ఎందుకంటే పురాతన కాలం నుంచి బ్రాహ్మణులకు అన్నం పెట్టడం చాలా పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

యోగినీ ఏకాదశి పూజా విధానం
ఏకాదశి నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. చేతిలో గంగాజలం తీసుకొని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించండి. పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు.

ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి.

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత
హిందూ గ్రంథాల ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస నియమాలను పాటించడం ద్వారా.. ఒక వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. ఈ రోజు చేసే ఉపవాసం జీవితంలో ఆనందం, శ్రేయస్సు , శాంతిని కూడా తెస్తుంది. ఈ ఉపవాసం పాటించే వ్యక్తికి అన్ని రకాల ఆనందాలు లభిస్తాయని.. చివరికి మోక్షం లభిస్తుందని నమ్మకం.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.