వినాయక చవితి వీధుల్లోనే.. అది కూడా 9 రోజులు ఎందుకు జరుపుకుంటారు! దీని వెన ఉన్న కథేంటి!
వినాయక చవితి ఇది అన్ని పండగల కంటే ప్రత్యేమనది.. అన్ని పండగలు ఒకటి రెండ్రోజులు జరుపుకుంటే తొమ్మిది రోజుల పాటు ఒకే దైవాన్ని పూజిస్తూ జరుపుకునే ఏకైక పండగ వినాయక చవితి.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే, ఆనందంగా జరుపుకునే పండగల్లో ఇది ఒకటి.. అయితే ఈ వినాయక చవితి తొమ్మది రోజులే ఎందుకు జరుపుకుంటారు, అసలు విగ్రహాలను వీధుల్లో ఎందుకు పెడతారని మీరెప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది ఎన్నో పౌరాణిక కథలు, చారిత్రక సంఘటనలు, సామాజిక ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప ఉత్సవం. దాదాపుగా 50కి పైగా పండుగలను జరుపుకునే హిందువులు, వినాయక చవితిని మాత్రం ప్రతి వీధిలో ఒక విగ్రహాన్ని పెట్టి, మూడు రోజుల నుండి 10 రోజుల వరకు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ వెనక కొన్ని పౌరానిక కథలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు అజేయమైన విజయాల కోసం పరమేశ్వరుడి కొరకు ఘోర తపస్సు చేశాడట.దీంతో గజాసురుడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు ఏం వరం కావాలని కొరగా.. గజాసురుడు మీరు ఎప్పటికీ నా కడుపులోనే ఉండిపోవాలి అని కోరాడు. దీంతో తదాస్తు అన్న శివుడు ఇచ్చిన వరం మేరకు సూక్ష్మ రూపంలోకి మారి గజాసురుడి కడుపులోకి వెళ్లిపోతాడు.
అయితే శివుడు కనపడకపోవడంతో ఆందోళన చెందిన పార్వతీదేవి శ్రీమహావిష్ణువును ఆశ్రయించగా ఆయన తన దివ్యదృష్టితో గజాసురుడి వ్యూహాన్ని గ్రహించి, శివుడిని తిరిగి తీసుకువచ్చే బాధ్యతను స్వీకరించాడు. బ్రహ్మ, దేవ గణాలతో కలిసి మారువేషంలో, నందిని గంగిరెద్దులా అలంకరించి గజాసురుడి వద్దకు వెళ్లాడు. సన్నాయి మేళాలతో, నాట్యాలతో గజాసురుడిని సంతోషపరిచి, ఈ గంగిరెద్దుకు దాని ప్రభువు శివుడు కావాలి, మీరు శివుడిని ఇక్కడికి తీసుకువస్తే మేము వెళ్తాము అని కోరాడు.
అప్పుడు గజాసురుడు తన కడుపులోని శివుడితో తన చివరి కోరిక నా మరణం తర్వాత నా తలను ముల్లోకాలు పూజించాలి అని వేడుకున్నాడు. శివుడు అంగీకరించడంతో, విష్ణువు సైగ చేయగా, నంది గజాసురుడి పొట్టను చీల్చి శివుడిని బయటకు తీసుకొచ్చింది. గజాసురుడి తలనే శివగణాలు గణేశుడికి తీసుకువచ్చి అతికించారని కథనం.
మరో కథనం
పార్వతీ దేవీ తన ఒంటి మీద పసుపుతో ఒక చిన్న పిల్లాడి రూపాన్ని చేసి, దానికి ప్రాణం పోసింది. ఆ పిల్లాడే గణేశుడు. అయితే పార్వతీదేవి స్నానం చేసే సమయంలో ఎవరినీ లోపలికి రానివ్వదని గణేశుడికి చెప్పవి వెళ్లగా.. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడిని గణేశుడు అడ్డుకున్నారు. గణేశుడు తన పుత్రుడని తెలియని శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతో గణేశుడి తలను ఖండించాడు. తన కుమారుడు మరణించాడని తెలుసుకున్న పార్వతీదేవి మహాశక్తి రూపంలో మారి ముల్లోకాలను నాశనం చేయబోయింది.
దీంతో దేవతలు ప్రార్థించగా, శివుడు ఉత్తర దిక్కున తలపెట్టి ఉన్న జీవి తలను తీసుకురావాలని ఆదేశించాడు. శివగణాలు ఏనుగు తలను తీసుకురాగా, శివుడు ఆ తలను గణేశుడి శరీరానికి అతికించి ప్రాణం పోశాడు. అలా గణేశుడు గణపతి, విఘ్నేశ్వరుడు గా అవతరించాడని కథనం. అప్పటినుండి భాద్రపద శుక్ల చవితిని వినాయక చవితిగా జరుపుకోవడం మొదలైనట్టు పరాణాలు చెబుతున్నాయి.
లోకమాన్య తిలక్ పాత్ర
అయితే వినాయక విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించి పూజించడం అనేది పురాణాల్లో లేదు కానీ.. దీని వెనక చారిత్రక ప్రాధాన్యత ఉంది. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఏ చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేసినా కాల్చి చంపేవారు. ఈ పరిస్థితిని గమనించిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిని బలంతో కాకుండా తెలివితో ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 1890లో పూణే, మహారాష్ట్ర ప్రాంతాల్లో వినాయక చవితిని ఒక ప్రైవేట్ పండుగలా కాకుండా, ఒక పబ్లిక్ ఫెస్టివల్ లా కమిటీలు వేసి జరుపుకోవాలని నిర్ణయించారు. ఇది కేవలం ఒక హిందూ సాంప్రదాయ పండుగే అని బ్రిటిష్ వారిని నమ్మించి అనుమతులు పొందారు.
వినాయక చవితి జరిగే 10 రోజులు యువతను పోగుచేసి, వారికి దేశభక్తిని పెంచే ప్రసంగాలు చేస్తూ, పాటలను పెడుతూ వేల మంది ఉద్యమకారులను తయారు చేసేవాడు. ఈ పద్ధతి దేశం మొత్తం వ్యాపించి, వినాయక చవితిని ఒక స్వతంత్ర పోరాట సభగా ఉపయోగించుకున్నారు. అలా ఈ పండుగ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించి, కుల మత భేదాలు లేకుండా ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చింది. 1890 నుండి వినాయక చవితిని బహిరంగంగా, సామూహికంగా జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు మత విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా అందించబడుతున్నాయి. ప్రాంతానుసారం తేదీలు, సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని ఆథ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
