Topi Amma: అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ? మీకు తెలియని అసలు నిజం ఇదే..

అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన పళని అమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసే ఆమె జీవితం, భక్తుల నమ్మకాలు, ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ కథనంలో తెలుసుకుందాం...

Topi Amma: అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ? మీకు తెలియని అసలు నిజం ఇదే..
Topi Amma

Updated on: Dec 31, 2025 | 8:58 AM

అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు పళని అమ్మ. తిరువన్నామలై వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ఒక అవధూత ఆమె. టోపీ అమ్మ పాదస్పర్శ, పాదధూళి లేదా ఆమె తాగి విసిరేసిన టీ కప్ లభించినా చాలు అని వందలాది, వేలాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. టోపీ అమ్మ ఎవరు, ఆమె మహిమ ఏమిటి అనేదానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అరుణాచలం గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలో ఆమె గురించి చెప్పుకోవడం తప్పనిసరి. ఆమె అవధూత అని నమ్మేవారు కొందరుంటే, కేవలం సాధారణ మతిస్థిమితం లేని మహిళ అని కొట్టిపారేసే వారు కూడా ఎందరో ఉన్నారు.

టోపీ అమ్మ అసలు పేరు పళని అమ్మ. ఆమెది అరుణాచలం కాదని, కన్యాకుమారి అని చెబుతారు. కన్యాకుమారి నుంచి అరుణాచలానికి ఆమె ఎందుకు, ఎప్పుడు వచ్చిందనే దానిపై భిన్న కథలున్నాయి. ఒక సమాచారం ప్రకారం.. ఆమె చిన్న వయసులోనే అరుణాచలం వచ్చి, అప్పటి నుంచి ఒంటరిగానే ఇక్కడే స్థిరపడింది. మరొక కథనం ప్రకారం, 16 సంవత్సరాల క్రితం తన తమ్ముడు చనిపోయినప్పుడు మతిస్థిమితం కోల్పోయి, పెళ్లి అయి, పాప ఉన్నప్పటికీ, అరుణాచలం వచ్చి గిరిప్రదక్షిణలు చేస్తూ ఇక్కడే ఉండిపోయింది. ఆమె అరుణాచలానికి రావడం, ఇక్కడే స్థిరపడటం, నిత్యం గిరిప్రదక్షిణలు చేయడం వాస్తవం. టోపీ అమ్మ తన జీవితంలో ఇప్పటివరకు దాదాపు 12,000 సార్లు అరుణాచల గిరిప్రదక్షిణం చేసిందని స్థానికులు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం 6:00 నుంచి 7:00 గంటల మధ్య తన 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణాన్ని ప్రారంభిస్తుంది. మధ్యాహ్నానికల్లా దీనిని పూర్తి చేసి, ఆ సమయంలో నిత్యం అరుణాచలేశ్వరుడినే ధ్యానిస్తుంది. ఆకలి వేసినప్పుడు చుట్టుపక్కల హోటళ్లకు వెళ్లగా, హోటల్ యజమానులు ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఆమెకు నచ్చినంత తిని మిగిలింది అక్కడే వదిలి వెళ్లిపోతుంది. భక్తులు ఆమె చూపు పడితే,  పాదధూళి దొరికినా చాలు అనుకుని ఆమెకు డబ్బులు, ఆహారం, పానీయాలు అందిస్తుంటారు. ఆమె కోపంతో కొట్టినా, తిట్టినా తమకు అదృష్టంగా భావిస్తారు.

అయితే, భక్తుల అధిక తాకిడి వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతారు. టోపీ అమ్మ ప్రాచుర్యానికి ఒక సంఘటన కారణమని చెబుతారు. సుమారు 15-16 సంవత్సరాల క్రితం, మణిమారన్ అనే వ్యక్తి మూత్రపిండాలలో రాళ్లతో బాధపడుతుండగా, టోపీ అమ్మ స్పర్శతో తన సమస్య దూరమైందని చెప్పాడు. అప్పటి నుంచి మణిమారన్ ఆమెకు సన్నిహితుడయ్యాడు. మణిమారన్ సుమారు 6,000 అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి. జయలలిత, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఆయన సేవలను ప్రశంసించారు. మణిమారన్ సమస్య పరిష్కారమైన తర్వాత టోపీ అమ్మకు మరింత ప్రఖ్యాతి లభించింది. ఈ ప్రాచుర్యంతో పాటు ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె లాలాజలం ఒంటికి రాసుకుంటే చర్మ వ్యాధులు మటుమాయం అవుతాయని.. ఆమె విడిచిన దుస్తులు ముట్టుకుంటే ఎలాంటి జబ్బులైనా నయం అవుతాయని..  ఆమె తాగిన టీ కప్పులోని టీ తాగితే రోగాలు నయమవుతాయని, ఆమె నవ్వితే ధనప్రాప్తి కలుగుతుందని, డబ్బులు స్వీకరిస్తే ఐశ్వర్యం వస్తుందని, చెప్పులు ఇస్తే గ్రహ బాధలు తొలగిపోతాయని రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. దీనితో భక్తులు ఆమెను ఏదో రకంగా తాకాలని, ఆమె చూపు తమ మీద పడాలని విపరీతంగా ప్రయత్నిస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవలి కాలంలో కొందరు భక్తులు ఆమెకు రక్షగా ఉంటూ, మానవహారంగా ఏర్పడి, భక్తుల తాకిడిని నియంత్రిస్తూ గిరిప్రదక్షిణం చేయిస్తున్నారు. గిరిప్రదక్షిణం సమయంలో కాలభైరవులే (ఏడు కుక్కలు) ఆమెకు రక్షణగా ఉంటారని స్థానికుల విశ్వాసం. మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించే, పాత బట్టలు ధరించి, మురికితో, లాలాజలంతో, అట్టకట్టిన శిరోజాలతో ఉన్నప్పటికీ, చాలా మంది ఆమెలో దైవాన్ని చూస్తారు.

అయితే, ఆమె దైవదూత అయినా, సాధారణ వ్యక్తి అయినా సరే ఆమెను ఇబ్బంది పెట్టడం అనాగరిక చర్య. ఆమెలో దైవం కనిపిస్తే దూరం నుంచి నమస్కరించండి, చిరునవ్వుతో పలకరించండి. ఆమెను తాకడానికి, పాదధూళి సంపాదించడానికి ప్రయత్నించి ఇబ్బంది పెట్టడం సరికాదు.

ఆమె దైవదూతే అనుకుంటే.. ఆమె జ్ఞానాన్ని ప్రసాదించగలదు కానీ కోరికలు తీర్చలేదు. ద్వేషంతో చేసినా, భక్తి పేరుతో చేసినా అవధూతలను ఇబ్బంది పెట్టడం తప్పు. కళ్లముందు అవధూత కనిపిస్తే దూరం నుండి నమస్కరించాలి.. వారి మార్గాన్ని అనుసరించాలి. టోపీ అమ్మ ప్రతిరోజు గిరి ప్రదక్షిణం చేస్తారని, ప్రజలు కూడా ఆమె మార్గాన్ని అనుసరించి గిరి ప్రదక్షిణం చేయాలి. బలవంతంగా ఆహారం ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, కాళ్లను పట్టుకోవడం వంటివి ఆవిడను ఇబ్బంది పెడుతున్నారు..ఇవి పాపపు పనులు, ప్రకృతి అలాంటి కచ్చితంగా బుద్ధి చెబుతుంది అని పండితులు చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..