విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన ప్రఖ్యాత కనకదుర్మమ్మ ఆలయంలో ఏసీబీ సోదాలు..! ఆశ్చర్యకరమైన విషయమే అయినా ప్రస్తుతం అమ్మవారి కొండపై విస్తృతంగా ఇవాళ కూడా సోదాలు జరుగుతున్నాయి. ఆలయంలోని ప్రధాన విభాగాల్లో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు సాగిస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఏసీబీ సోదాలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై.. స్టోర్, చీరల విభాగం సహా పరిపాలన విభాగం, ప్రసాదాలు కౌంటర్లు, తయారీ విభాగం, టికెట్ కౌంటర్లలో అధికారులు సోదాలు చేశారు. 300 రూపాయల దర్శనం టికెట్టు కౌంటర్లో లెక్కకు మించి ఉన్న నగదును అధికారులు గుర్తించినట్టు సమాచారం.
దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు పెంచడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కొవిడ్ నిబంధనలకు విరుద్దంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటు… అమ్మవారి హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలున్నాయి. హుండీ లెక్కింపు సమయంలో ఆయల అధికారులు నిబంధనలు పాటించలేదని… నవరాత్రి తర్వాత ఇద్దరు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోలేదు. ఇక భవానీ దీక్షల విరమణ సందర్భంగానూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ అమ్మవారి చీరలు మాయమైన ఘటనపై కూడా ఆలయ అధికారులు, పాలకమండలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ సోదాలు ఆసక్తిగా మారాయి.
కాగా, కొంతకాలంగా విజయవాడ దుర్గగుడి ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. మొన్నటికి మొన్న వెండిరథంపై సింహాల ప్రతిమల మిస్సింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు 4 నెలల విచారణ అననంతరం అధికారులు విగ్రహాలను రివకరీ చేశారు. తాజాగా ఏసీబీ దాడులు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సోదాల్లో మొత్తం 4 బృందాలుగా 40 మంది అధికారులు పాల్గొంటున్నారు. అలాగే ఆలయ అధికారులు, సిబ్బంది నుంచి కీలక వివరాలు సేకరిస్తున్నారు.
అమ్మవారి ఆలయంలో అవినీతి జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. విపక్ష పార్టీలు వెల్లంపల్లిని టార్గెట్ చేసుకుని అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల వల్ల ప్రభుత్వం ఆభాసుపాలు అవుతుందని భావించిన ప్రభుత్వమే ఏసీబీ దాడులకు అనుమతి ఇచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ దాడుల్లో వెలుగు చేసే విషయాల ఆధారంగా వెల్లంపల్లిపై చర్యలు తప్పవన్న ప్రచారమూ జరగుతోంది.