
విదురుడు మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకరు. ఆయనను మహాత్ముడిగా, సత్త్వగుణ సంపన్నుడిగా, నీతి శాస్త్రంలో ప్రావీణ్యం కలవాడిగా భావిస్తారు. ఆయన బోధనలు “విదుర నీతి”గా ప్రసిద్ధి చెందాయి. ఇవి వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యతలు, ధర్మం, సమయపాలన వంటి అనేక అంశాలపై విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. విదుర నీతి ప్రకారం జీవితంలో సమయం అత్యంత విలువైనది. సరైన సమయంలో పనులను పూర్తి చేస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. పగటి సమయంలో చేయాల్సిన పనులను అదే రోజున పూర్తి చేస్తే రాత్రి నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. ఇది సంతృప్తికరమైన జీవనానికి దారితీస్తుంది. అయితే పనులను వాయిదా వేయడం, సోమరితనానికి లోనవడం ఆందోళనలకు కారణమవుతుందని విదురుడు హెచ్చరిస్తాడు.
అలాగే, ఒక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే కష్టపడి పని చేసి అవసరమైన సిద్ధత కలిగి ఉండాలని సూచిస్తారు. అలా చేస్తే వర్షాకాలం వంటి కష్టసమయాల్లో ఇబ్బందులు ఎదురుకావు. అంటే భవిష్యత్తు కష్టాలను ముందుగానే ఊహించి సిద్ధంగా ఉండడం తెలివైన జీవన విధానమని విదుర నీతి చెబుతుంది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకులు తమ వివేచనతో పరిశీలించగలరు. దీనిని సంస్థ ధృవీకరించదు.)