
ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదా..? వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారా..? అయితే దీనికి వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా, లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా మన పర్సులో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. బియ్యం వృద్ధికి, శ్రేయస్సుకు చిహ్నం. మీ పర్సులో కొన్ని బియ్యం గింజలను ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇది అనవసర ఖర్చులను తగ్గించి మీ పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉండేలా చూస్తుందని నమ్ముతారు.
సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అయితే ఆ సంపదను కాపాడేవాడు కుబేరుడు. అందుకే పర్సులో చిన్న కుబేర యంత్రాన్ని ఉంచుకోవడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఇది ఒక శక్తివంతమైన పరిష్కారం.
సముద్రం నుంచి లభించే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. వాస్తు ప్రకారం.. పర్సులో ఒక గోమతి చక్రాన్ని ఉంచుకుంటే ప్రతికూల శక్తి దూరమై, ధనాకర్షణ పెరుగుతుంది. నిరంతరం ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారు ఈ చిట్కాను పాటించడం మంచిది.
వెండి చంద్రుడికి, మహాలక్ష్మికి చిహ్నం. పర్సులో ఒక వెండి నాణెం ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఇది సానుకూల ప్రకంపనలను సృష్టించి, మీరు చేసే పనుల్లో పురోగతిని తెస్తుంది. లక్ష్మీదేవి రూపు ఉన్న నాణెం అయితే మరింత శ్రేష్ఠమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వాస్తు చిట్కాలు పాటించడంతో పాటు మీ పర్సును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. చిరిగిన కాగితాలు, పాత బిల్లులను పర్సులో ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో ఆర్థిక వెలుగులను నింపుతాయి.
(NOTE: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. వివిధ వాస్తు శాస్త్ర నిపుణులు, మత గ్రంథాల ఆధారంగా అందించడం జరిగింది. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణులు లేదా మీ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీనికి TV9 ఎటువంటి బాధ్యతను వహించదు.)