
వాస్తు శాస్త్రం అనేక వాస్తు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఏది, ఎక్కడ, ఎలా ఉంటే మంచి జరుగుతుందో అలాంటి సూచనలు చేస్తుంది. ఇంట్లోని వస్తుల గురించి కూడా స్పష్టంగా తెలియజేసింది. ఇంట్లో ప్రధాన భాగమైన వంట గది కేవలం వంట చేయడానికి మాత్రమే కాదు.. ఇంట్లో సానుకూల కేంద్రంగా కూడా ఉంటుంది. వాస్తు శాస్త్రం వంటగదిని ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పేర్కొంది. వంటగది మొత్తం కుటుంబ బలాన్ని పొందే ప్రదేశం అని తెలిపింది.
వంట గదిలో సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తే.. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి. అయితే, చిన్న పొరపాటు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వంటగదిలో అనేక రకాల పాత్రలు ఉన్నప్పటికీ.. ఆహారం వండే పాత్ర లేదా నిల్వ ఉంచే గిన్నెను చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ పాత్రను ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదని నమ్ముతారు. కడిగి ఆరబెట్టేటప్పుడు మాత్రమే దానిని ఖాళీ చేయడం ఉత్తమమని అంటారు. కాబట్టి, ఆహార పాత్ర (గిన్నె/బౌల్) లను ఎప్పుడూ ఖాళీగా ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం.
వాస్తు, సంప్రదాయాల ప్రకారం.. వంటగదిని అన్నపూర్ణ దేవి నివాసంగా భావిస్తారు. ఆమె ఇక్కడ నివసిస్తుందని చెబుతారు. ఆహారాన్ని గౌరవించని ఇంట్లో, అన్నపూర్ణాదేవీ ఆశీస్సులు తగ్గుతాయని నమ్ముతారు. ఆహార పాత్రను పదే పదే ఖాళీ చేయడం.. ఆహారం లేకపోవడం, అసమతుల్యతను సూచిస్తుందని చెబుతారు. ఇది దురదృష్టంతో ముడిపడి ఉంటుంది.
లక్ష్మీ దేవికి ఆహారంతో కూడా లోతైన సంబంధం ఉంది. ఆహారాన్ని గౌరవించే ఇళ్లు ఎప్పుడూ సంపద, ఆనందంతో ఉంటుంది. ఆహారం వండే పాత్రను ఎక్కువ సేపు ఖాళీగా ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఆదాయం లేకపోవడం జరుగుతుందని చెబుతారు. ఏదైనా కారణం చేత ఆ పాత్ర ఖాళీ అయితే.. దానిని అలా ఉంచకుండా బియ్యం ఉంచవచ్చని చెబుతున్నారు. బియ్యం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పూజలు, ఉపవాసాలు, శుభ సందర్భాలలో కూడా ఉపయోగిస్తారు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, వాస్తు శాస్త్రం వంటి అంశాలతో ముడిపడి ఉంది. దీనిని TV9 తెలుగు ధృవీకరించదు.