
వాస్తు శాస్త్రం అనేది ఇంటి నిర్మాణం, ఇంట్లోని వస్తువులు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండకూడదు? వాటి అమరికల వల్ల వచ్చే మంచి.. చెడు ఫలితాల గురించి తెలియజేస్తుంది. ఇలా అనేక సమస్యలకు వాస్తు శాస్త్రం పరిష్కారాలను చూపిస్తుంది. ఏ వస్తువును ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో చెబుతుంది. ఇప్పుడు, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును సరైన రీతిలో ఉపయోగించడం, ఎక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి ఆకర్షింపబడి, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. చీపురును అస్తవ్యస్తంగా పెట్టడం వల్ల దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని, లక్ష్మీ దేవి కోపగించుకుంటుందని నమ్ముతారు. కాబట్టి, కొన్ని నియమాలను పాటించడం ముఖ్యం.
చీపురును కొనుగోలు చేయడానికి అమావాస్య, మంగళవారం, శనివారం, ఆదివారం శుభప్రదమైనవి. అయితే, సోమవారం శుక్లపక్షంలో చీపురు కొనడం అశుభం, ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చని వాస్తు చెబుతుంది.
ఇంట్లో చీపురును ఎప్పుడూ వంటగదిలో ఉంచకూడదు. దానిని ఎల్లప్పుడూ దక్షిణ, పడమర దిశల మధ్య స్థలంలో ఉంచాలి. చీపురును నిటారుగా నిలబెట్టకుండా, ఎల్లప్పుడూ నేలపై పడుకోబెట్టాలి.
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు, పశ్చిమం లేదా ఉత్తరం వైపు నుంచి తుడుచుకు రావాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోకుండా చూసుకోవడం పేదరికాన్ని దూరం చేస్తుంది. చీపురును ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. సాయంత్రం తర్వాత ఇంట్లో చీపురును వాడటం మంచిది కాదు.
ఈ వాస్తు నియమాలు పాటించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అందుకే చీపురును వాస్తు ప్రకారం ఉపయోగించి సానుకూల ఫలితాలను పొందండి.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)