Vastu Tips: ఇంటి సింహ ద్వారంతో జాగ్రత్త! ఈ వాస్తు టిప్స్ కచ్చితంగా పాటించండి..
ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా ఇల్లు కొనేటప్పుడు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం..
ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా ఇల్లు కొనేటప్పుడు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది ఇంటి యజమాని ఆరోగ్యానికి, ఆదాయానికి, పురోగతికి సంబంధించినది. సింహద్వారం అంటే మెయిన్ డోర్ ఎలా ఉండాలన్న దానికన్నా సింహద్వారం ముందు ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే ప్రాథమిక, కీలక అంశాలపై సమరాంగన, విశ్వకర్మ వంటి అతి పురాతన గ్రంథాలు ఎంతో వివరణ ఇచ్చాయి. అందువల్ల ఇంట్లోని ఇతర ద్వారాల కంటే ఎక్కువగా సింహద్వారానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సింహద్వారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అని ఆలోచించడంతోపాటు సింహద్వారానికి ముందు ఏముండాలి, ఏవి ఉండాలి అని కూడా ఆలోచించాలి. అది ఏ దిక్కులో ఉన్న ద్వారం అయినప్పటికీ, ద్వారానికి ముందు ఏమున్నాయన్నదే ఇక్కడ ముఖ్యమైన విషయం. వాస్తు శాస్త్రం చెప్పిన విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో ఆ ఇంట క్షేమ, ఆరోగ్య, సంపదలు ఖాయమని విశ్వకర్మ అనే గ్రంథం అనేక ఉదాహరణలతో వివరించింది. ఈ గ్రంథాలలో వెల్లడించిన విశేషాలు ఆధునిక వాస్తు గ్రంథాలలో కనిపించడం లేదు.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, సింహద్వారం తలుపు వేస్తున్నప్పుడు, ఇస్తున్నప్పుడు ఎటువంటి శబ్దము రాకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా శబ్దాలు వచ్చిన పక్షంలో ఆ ఇంట్లో తరచూ దారిద్య్రం తాండవిస్తూ ఉంటుంది. ఆ ఇంటి వారికి ఎప్పటికీ ఆకలి తీరదని శాస్త్రం చెబుతోంది. సింహద్వారం తలుపుల నుంచి కిర్రుమనే శబ్దం వెలువడ రాదని, అది ఆ ఇంటికి ఏమాత్రం మంచిది కాదని గ్రహించాలి. అంతేకాదు ద్వారబంధంలో ఎక్కడా వంపు కనిపించకూడదు. వంపు వల్ల ఇంటి ఆర్థిక వ్యవహారాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. తలుపుల్లో కానీ, ద్వారంలో అమర్చిన ఇతర చెక్కల్లో కానీ ఎక్కడా చిన్నపాటి వంపు కూడా కనిపించకూడదు అని శాస్త్రకారులు పదేపదే చెబుతుంటారు. ఇంటి కింది వాటాలో సింహద్వారాన్ని ఏ విధంగా, ఏ పద్ధతుల్లో, ఏ కొలతలలో అమర్చడం జరిగిందో, పై అంతస్తుల లో కూడా అదే విధంగా అమర్చాలని శాస్త్రం చెబుతోంది.
మెయిన్ డోర్‌కు ముందు నాలుగు రోడ్ల కూడలి ఉండకూడదు. అంటే తలుపు తీయగానే ఎదురుగా నాలుగు రోడ్ల కూడలి కనిపించకూడదు. దీని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ఇంటి యజమాని ఎప్పుడూ ప్రవాసంలో ఉండటమో, ఇంటికి దూరంగా ఉండటమో జరుగుతుంటుంది. అంతేకాదు, ఇంట్లో నౌకర్లు ఉన్న పక్షంలో వారు ఆ ఇంటి వారిని నానా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఇక సింహద్వారానికి ఎదురుగా జెండాలు, జెండాలు కట్టిన చెట్లు ఉండటం ఆ కుటుంబానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఆ ఇంటి యజమాని లేదా ఆ ఇంటిలోని వారు ఎంత సంపాదించినా ఏదో విధంగా హారతి కర్పూరం అయిపోతుంది. ఇటువంటి అంశాల విషయంలో ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం ఉండదు. జెండాలు కాకుండా చెట్లు మాత్రమే ఎదురుగా ఉంటే ఆ ఇంట్లోని వారికి తరచూ గర్భస్రావాలు జరుగుతుంటాయి. సంతానం నిలవదు. అంతేకాక పిల్లలు తరచూ అనారోగ్యాలతో అవస్థలు పడుతుంటారు.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ద్వారానికి ఎదురుగుండా బురద గుంటలు, గోతులు ఉండకూడదు. అలా గనుక ఉంటే ఆ ఇంట్లోని వారు ఏనాడు సంతోషంగా ఉండలేరు. ఆ ఇంట్లోంచి నవ్వుల కంటే ఎక్కువగా ఏడుపులే వినిపిస్తుంటాయని శాస్త్రం చెబుతోంది. నీటి కాలువలు ఉన్నా మంచిది కాదని, అనారోగ్యాల మీద డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుందని గ్రహించాలి. ద్వారానికి ఎదురుగుండా లోతట్టులో బావి ఉంటే యజమానికి అపస్మారక వ్యాధి ఉంటుందని చెబుతారు. ఇక గుమ్మానికి ఎదురుగుండా ఏ ఆలయమూ ఉండకూడదని, ఉంటే వంశ నాశనం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. గుమ్మానికి ఎదురుగుండా స్తంభం కూడా ఉండకూడదు అని, ఉంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు అరిష్టమని తెలుస్తోంది. ఇంటి ఎదురుగా కుమ్మరి సారే, కుండల బట్టి ఉండకూడదు. ఇవి గనుక ఉంటే ఆ ఇంట్లోని వారు పురోగతి సాధించలేరు. తలుపు తెరవగానే బూడిద కనిపించకూడదు. దానివల్ల ధన నాశనం, ఆయువు క్షీణత కలుగుతాయి.
ఇక్కడ మరికొన్ని అంశాలను కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రధాన ద్వారం మీద చెట్టు నీడ పడకూడదు. దానివల్ల ఇంట్లో వారికి మనశ్శాంతి ఉండదు. ఇల్లు ప్రశాంతంగా ఉండదు. ఆ ఇంట్లోని వారికి పురోగతి ఉండదు. బాగా ఆస్తి నష్టం జరుగుతుంది. ద్వారం పైన వేసే చెక్క ఏక ఖండంగా ఉండాలి. రెండు ముక్కలను కలిపి వేస్తే ఆ ఇంటి యజమాని ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇటువంటి అంశాలన్నిటినీ జాగ్రత్తగా గమనించి, అర్థం చేసుకుని ప్రధాన ద్వారాన్ని అమరిస్తే ఆ ఇంటి వారు అన్ని విధాల పైకి వస్తారు. ఈ రకమైన సమస్యల్ని వాస్తు శాస్త్ర పరిభాషలో ద్వార వేధలు అంటారు. ఇటువంటి వేదలకు పరిహారం అనేది ఉండదు. అందువల్ల జాగ్రత్తగా చూసుకొని ఇంటిని అమర్చుకోవాల్సి ఉంటుంది.