
కొందరి రోజూ ఇంటిని తుడిచే అలవాటు ఉంటుంది. మరికొందరు వారాలను అనుసరించి తడిగుడ్డ పెడుతుంటారు. అయితే, ఇంటిని ఏ రోజు, ఏ సమయంలో తుడుస్తున్నాం అనే విషయాలు కూడా చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు తుడవడం వల్ల లేని పోని దోషాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. అలాగే ఇళ్లు నిత్యం కళకళలాడుతూ లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండాలంటే ఇంటిని తుడిచే నీటి విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలట. ఈ నీటిలో కొన్ని రకాలైన పదార్థాలను కలపడం వల్ల ఆ ఇంట్లోని వారంతా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం తెలిసిన వారు చెప్తున్నారు. మరి ఇంటిని తుడిచే విషయంలో మీరు కూడా ఈ చేయకూడని పొరపాట్లు చేస్తున్నారో లేదో ఓసారి పరిశీలించుకోండి.
రోజూ ఉదయాన్నే ఇల్లు తుడిచే వారు గుర్తంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. ఇంటి నుంచి భర్త బయటకు వెళ్లగానే ఇంటిని తుడవకూడదట. అలాగే ఇంటి సభ్యులు అంతా వెళ్లిపోయాక కూడా ఇంటిని తుడిచే అలవాటు మంచిది కాదని అంటన్నారు. దీనికి బదులు ఉదయం లేవగానే చేసే పనుల్లో ఇంటిని ఊడ్చటం, తుడవటం వంటివి చేస్తే సరిపోతుంది.
ఇంటిని తుడిచేందుకు ఎప్పుడూ మంచి బకెట్ ను మాత్రమే వాడాలి. కొందరు పగిలిన బకెట్లను, పాడైపోయిన వాటిని ఇందుకోసం వాడుతుంటారు. ఇదంత మంచిది కాదు. అలాగే ఇంటిని తుడిచిన నీటిని గుమ్మం వైపు విసరడం లాంటివి చేయకూడదు. కొందరు బట్టలు ఉతికిన నీటిని కూడా వచ్చీ పోయే దారిలో వదులుతుంటారు. ఇది ఆ నీటిని దాటి వెళ్లిన వారిని అనారోగ్యం పాలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంటిని తుడిచిన నీటిలో ఉండే బ్యాక్టీరియా కాలి గోర్ల నుంచి శరీరంలోకి వెళ్లగలదు. ఇది రోగాలను తెచ్చి డబ్బు ఖర్చయ్యేలా చేస్తుంది. అందుకే ఇలా చేయడం అరిష్టమంటారు.
తమ సమయానికి అనుగుణంగా ఉండే రోజులను ఇళ్లును తుడిచేందుకు కేటాయస్తుంటారు. అయితే, ఇందులో గురువారం రోజున ఇంటి నేలను తుడవకూడదని శాస్త్రం చెప్తోంది. ఇలా చేయడం వల్ల ఆయా వ్యక్తుల జాతకంలో గురు బలం తగ్గిపోతుంది. ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా గురుబలం లేకపోతే ఆ ఇంట శుభకార్యం జరగదని పెద్దలు చెప్తుంటారు. అందుకే ఇలా చేయడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువ.
ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తున్నా.. తరచూ భార్య భర్తల మధ్య గొడవల వంటివి జరుగుతున్నా వారి ఈ రెమిడీ కచ్చితంగా పాటించాలి. ఇంటిని తుడిచే నీటిలో కాస్త గళ్ల ఉప్పును కలపాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు నివారించబడతాయి. సైన్స్ కూడా ఉప్పు నీటితో ఇంటిని తుడవడం మంచిదని చెప్తోంది.
మీరు ఎంత బిజీ పనిలో ఉన్నా.. ఇంకేదైనా కారణం చేతైనా ఇంటిని తుడిచే సమయం కచ్చితంగా పాటించాలి. అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఇంటిని తుడవాలి. అలా కాదని మధ్యాహ్నం ఇంటిని తుడిస్తే అది అరిష్టం తీసుకువస్తుందంటారు. ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాలి.