Uthana Ekadashi 2024: వివాహంలో జాప్యమా..! ఉత్థాన ఏకాదశి రోజున ఇలా చేసి చూడండి.. శీఘ్రమే కళ్యాణ యోగం!

|

Nov 05, 2024 | 8:19 AM

కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిధిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నాలు నెలల పాటు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడని నమ్మకం. విష్ణువు మేల్కొన్న అనంతరం అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఉత్థాన ఏకాదశిని దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. వివాహం విషయంలో జాప్యం జరుగుతున్న యువతీ యువకులు ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Uthana Ekadashi 2024: వివాహంలో జాప్యమా..! ఉత్థాన ఏకాదశి రోజున ఇలా చేసి చూడండి.. శీఘ్రమే కళ్యాణ యోగం!
Uthana Ekadashi 2024
Follow us on

కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధిని ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ ఉత్థాన ఏకాదశిని హరిబోధిని, ప్రబోధిని, దేవోత్తని ఏకాదశి అని కూడా అంటారు. నాలుగు నెలల పాటు నిద్రపోయిన ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు ఉత్థాన ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. విష్ణువు మేల్కొన్న తర్వాత పెళ్ళిళ్ళు, శుభకార్యాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం ఉత్థాన ఏకాదశి 12 నవంబర్ 2024 న వచ్చింది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీమహావిష్ణువును పూజిస్తారో వారి జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోతుందని మత విశ్వాసం.

కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి లక్ష్మీ దేవిని, శ్రీ హరిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఉత్థాన ఏకాదశి రోజున చేసే పూజలు దానాలు ప్రభావంతో ఎటువంటి పాపమైనా నశిస్తుందని నమ్మకం. అంతేకాదు ఎవరికైనా వివాహం ఆలస్యమవుతుంటే లేదా పెళ్లి కుదిరి చెడిపోతున్నట్లయితే.. వారు ఈ ఉత్థాన ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు పెళ్లి సమస్య తీరుతుందని.. కోరుకున్న వధూవరులు లభిస్తారని విశ్వాసం.

ఉత్థాన ఏకాదశి 2024 ఎప్పుడు..

వేద పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిధి నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6:46 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు అంటే నవంబర్ 12వ తేదీ సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయం తిథి ప్రకారం ఉత్థాన ఏకాదశి ఉపవాసం 12 నవంబర్ 2024 న ఆచరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉత్థాన ఏకాదశి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలంటే

ఉత్థాన ఏకాదశి ఉపవాసం ఉన్న భక్తులు మర్నాడు అంటే ద్వాదశి తిథి రోజున ఏకాదశి ఉపవాసం విరమిస్తారు. అటువంటి పరిస్థితిలో నవంబర్ 13వ తేదీ ఉదయం 6:42 నుండి 8:51 వరకు ఉత్థాన ఏకాదశి వ్రతం విరమించవచ్చు.

ఉత్థాన ఏకాదశి రోజున ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే

  1. ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ విషయంలో అడ్డంకులు ఎదుర్కుంటున్నట్లయితే.. వారు ఉత్థాన ఏకాదశి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.
  2. ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించడానికి కుంకుమ, పసుపు గంధం లేదా పసుపుని ఉపయోగించండి. అనంతరం శ్రీ హరికి పసుపు పుష్పాలను సమర్పించండి. పులిహోర, లడ్డు మిఠాయిలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల తొందరగా పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
  3. కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేరాలంటే ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించండి. శ్రీ మహా విష్ణువు రావి చెట్టులో నివాసం ఉంటాడని భావిస్తారు. కనుక ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీటిని సమర్పించడం వలన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
  4. ఉత్థాన ఏకాదశి రోజున తులసి కళ్యాణం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున తులసి వివాహం చేయడం ద్వారా వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని, తొందరగా వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు.
  5. ఉత్థాన ఏకాదశి రోజున తులసి మొక్కకు పచ్చి పాలలో చెరుకు రసం కలిపి నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈ రోజున తులసి మొక్క దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి. దీంతో వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

ఉత్థాన ఏకాదశి రోజున చేయాల్సిన పనులు ఏమిటంటే

  1. ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఆవు పాలతో శంఖాన్ని శుద్ధి చేసి అనంతరం గంగాజలంతో స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
  2. ఉత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించే సమయంలో ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.
  3. ఉత్థాన ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించేటప్పుడు.. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి.. తులసి దళాలు వేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.