Mystery Temple: ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..

|

Dec 05, 2024 | 10:02 AM

భారతదేశంలో రహస్యాలు నిండిన ఆలయాలకు కొదవలేదు. అలాంటి మిస్టరీలను దాచుకున్న ఆలయంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలో శివుడి వాహనం అయిన నందీశ్వరుడే నేటికీ మనవ మేథస్సుకు అందని ఓ రహస్యం. ఈ ఆలయం ఎక్కడ ఉందో, ఈ విగ్రహానికి సంబంధించిన నమ్మకాలు ఏమిటో తెలుసుకుందాం.

Mystery Temple: ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..
Uma Maheswara Temple
Follow us on

భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొన్ని సంఘటనలు నమ్మలేని నిజాలుగా సైన్ కు సవాల్ గా మిగిలిపోతున్నాయి. అనేక ఆలయాలు వాటి రహస్యాలు, అద్భుత మైన శిల్పకళా సంపదతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడు విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదని. ఈ విగ్రహం పరిమాణం పెరగడంలోని రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. అంతే కాదు ఈ విగ్రహం పరిమాణం పెరగడంపై అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. ఈ విగ్రహం గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో కూడా పేర్కొన్నాడు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ మిస్టరీ శివాలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలులో ఉంది. ఈ శివాలయాన్ని యాగంటి ఉమా మహేశ్వరాలయం అని పిలుస్తారు. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయాల ప్రకారం నిర్మించబడింది. దీనిని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు నిర్మించారు. ఇది పురాతన కాలం నాటి పల్లవ, చోళ, చాళుక్య , విజయనగర రాజుల సంప్రదాయాలకు ప్రతిబింభంగా నిలుస్తుంది.

పెరుగుతున్న నంది విగ్రహం

వాస్తవానికి లయకారుడైన శివుడు వాహనం నంది.. విశిష్ట భక్తుడు.. ప్రతి ఆలయంలో శివుడి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. అయితే అన్ని ఆలయాల్లోని నందీశ్వరుడి కంటే ఈ యాగంటి ఆలయంలోని నంది విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఈ నంది విగ్రహం గురించి భక్తులు అనేక నమ్మకాలను కలిగి ఉన్నాయి. ఇక శాస్త్రవేత్తలు కూడా ఈ నంది విగ్రహం పెరుగుదలపై అనేక పరిశోధనలు చేశారు. ఈ నంది విగ్రహం పరిమాణం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని చెప్పారు. ఈ నంది పెరుగుదలతో ఆలయంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వస్తోంది. అయితే ఈ నంది విగ్రహం పెరుగుదలతో పాటు, కలియుగం అంతమయ్యే సమయంలో ఈ విగ్రహం నందికి ప్రాణం వస్తుందని.. అప్పుడు రంకె వేస్తుందని.. ఆ రోజున కలియుగం అంతం అవుతుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఆలయానికి సంబంధించిన చరిత్ర

ఈ ఆలయ స్థాపనకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ శివాలయాన్ని అగస్త్య మహర్షి నిర్మించాడని చెబుతారు. అతను ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం బొటనవేలు విరిగింది. అప్పుడు సలహా కోసం అగస్త్య మహర్షి శివుడిని ఆరాధించాడు. అగస్త్య మహర్షి ఎదుట శివుడు ప్రత్యక్షమై ఈ ప్రదేశం కైలాసాన్ని తలపిస్తుంది.. అందుకే ఇక్కడ తన ఆలయాన్ని నిర్మించడం సరైనదని చెప్పాడని ఓ కథ.

శాపం వల్ల కాకులు కనిపించవు

ఈ ఆలయంలో కాకులు ఎప్పుడూ కనిపించవు. అగస్త్య మహర్షి శాపం వల్లనే ఇలా జరిగిందని చెబుతారు. కథ ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు అతన్ని వేధించాయి. కోపోద్రిక్తుడైన మహర్షి ఈ ఆలయ పరిసర ప్రాంతంలో ఎప్పటికీ కాకులు ప్రవేశించలేవని శపించాడని కథనం.

తిరుమల కంటే పురాతన విగ్రహం

యాగంటిలోని ప్రధాన ఆలయానికి ఆనుకుని అనేక గుహ దేవాలయాలు ఉన్నాయి. అగస్త్యుడు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసిన ప్రదేశం అగస్త్య గుహ అని నమ్ముతారు. ఈ ప్రాంతంలోని గుహలలో వెంకటేశ్వర గుహ మరొకటి. గుహలో లభించిన వెంకటేశ్వరుని విగ్రహం తిరుపతిలోని విగ్రహం కంటే చాలా పురాతనమైనదని స్థానికులు విశ్వసిస్తారు. వీర బ్రాహ్మణ గుహ అనేది కాలజ్ఞానం రచించిన పోతులూరి వీరబ్రహ్మం తన ప్రవచనాల పుస్తకంలోని కొన్ని అధ్యాయాలను వ్రాసిన ప్రదేశంగా నమ్ముతారు.

ఈ యాగంటి నందీశ్వరుడి ఆలయం హైదరాబాద్‌కు 308 కి.మీ దూరంలో .. విజయవాడ నుంచి 359 కి.మీ దూరంలో ఉంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.