AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే

Maha Shivaratri special: లింగోద్భవం కథ బ్రహ్మ, విష్ణువుల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరుతో ప్రారంభమవుతుంది. వారి యుద్ధాన్ని ఆపడానికి శివుడు అనంతమైన అగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. ఈ స్తంభం ఆద్యంతాలు కనుగొనే ప్రయత్నంలో బ్రహ్మ, కేతకీ పుష్పంతో అబద్ధం చెప్పి శివుని ఆగ్రహానికి గురయ్యాడు. లింగోద్భవం శివుని అనంతమైన స్వరూపాన్ని, ఆయన సర్వశక్తిమత్తతను తెలియజేస్తుంది.

Maha Shivaratri: లింగోద్భవం అంటే ఏమిటి..? శివలింగ ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే
Maha Shivaratri
Rajashekher G
|

Updated on: Feb 15, 2026 | 10:02 AM

Share

Lingodbhavam: మహా శివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ. ఈ రోజున శివరాధనలో భక్తులు మునిగిపోతారు. శివరాత్రి అనగానే అందరికి లింగోద్భవం గురించిన ఆసక్తి కలుగుతుంది. లింగోద్భవం అంటే ఏమిటి అనే ప్రశ్న.. తరచుగా చర్చకు వస్తుంది. ఈ పురాణ గాథ శివుని అనంతమైన శక్తిని, సృష్టికి ఆయన మూలమని తెలియజేస్తుంది. ఈ కథ ప్రకారం, ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్లినప్పుడు, విష్ణుమూర్తి ఆయనను కుమారా, క్షేమమేనా? అని పలకరించారు. సృష్టికర్తనైన తనను కుమారా అని సంబోధించడంతో.. బ్రహ్మ ఆగ్రహించి, తాను విష్ణువును సృష్టించానని వాదించారు. దీనికి విష్ణువు ప్రతిస్పందిస్తూ.. బ్రహ్మ తన నాభికమలం నుండి పుట్టాడని, సృష్టికర్త పదవిని తానే ఇచ్చానని స్పష్టం చేశారు. వారిరువురి మధ్య అహంకారంతో కూడిన వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరి, చివరికి అస్త్రాలతో యుద్ధానికి దారితీసింది.

బ్రహ్మ, విష్ణువుల మధ్యలో ఒక మహా తేజస్సు

ఈ యుద్ధంలో విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని, బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. ఈ రెండు శివ శక్తులు ఢీకొంటే విశ్వం నాశనమవుతుందని దేవతలు భయపడ్డారు. ఈ కల్లోలాన్ని ఆపడానికి మార్గం తెలియక వారు తలమునకలయ్యారు. సరిగ్గా ఆ సమయంలో, బ్రహ్మ, విష్ణువుల మధ్యలో ఒక మహా తేజస్సుతో కూడిన అగ్ని స్తంభం ఆవిర్భవించింది. ఆ స్తంభం అపారమైన ప్రకాశంతో వెలిగిపోయింది.

ఆద్యాంతంలేని అగ్ని స్తంభం

ఈ అగ్ని స్తంభం యొక్క ఆద్యంతాలను కనుగొనాలని బ్రహ్మ, విష్ణువు నిర్ణయించుకున్నారు. బ్రహ్మ హంస రూపంలో ఆ స్తంభం పైభాగాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరారు. అదే సమయంలో విష్ణువు వరాహ రూపం ధరించి, భూమిని తవ్వుకుంటూ ఆ స్తంభం అడుగు భాగాన్ని కనుగొనడానికి వెళ్లారు. ఇరువురూ ఎంత ప్రయత్నించినా, ఆ అనంతమైన స్తంభం యొక్క ఆదిని గానీ, అంతాన్ని గానీ కనుగొనలేకపోయారు.

విష్ణువు వైఫల్యాన్ని అంగీకరించినా.. బ్రహ్మ మాత్రం..

విష్ణువు తన వైఫల్యాన్ని అంగీకరించి పైకి వచ్చేశారు. అయితే, బ్రహ్మ మాత్రం తాను ఓడిపోకూడదని భావించి, అబద్ధం చెప్పాలని నిశ్చయించుకున్నారు. దారిలో కనిపించిన కేతకీ పుష్పం (మొగలి పువ్వు)తో, తాను ఆదిని కనుగొన్నానని సాక్ష్యం చెప్పమని అడిగారు, దానికి బదులుగా వరం ఇస్తానని చెప్పారు. కేతకీ పుష్పం బ్రహ్మ మాటలకు పొంగిపోయి, దొంగ సాక్ష్యం చెప్పడానికి అంగీకరించింది. కిందకి వచ్చిన తర్వాత బ్రహ్మ, పరమేశ్వరుడితో తాను ఆదిని కనుగొన్నానని, కేతకీ పువ్వు సాక్ష్యం అని చెప్పాడు.

బ్రహ్మపై శివుడి ఆగ్రహం.. కేతకీ పుష్పానికి శాపం

అప్పుడు శివుడు పరమేశ్వరుడిగా ప్రత్యక్షమై, ఆద్యంతాలు లేని తన స్వరూపం గురించి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మపై ఆగ్రహించారు. అప్పటివరకు బ్రహ్మకు ఊర్ధ్వముఖంగా ఉన్న ఐదవ తల, జ్ఞానానికి ప్రతీకగా ఉండేది. అబద్ధం చెప్పినందుకు ఆ శిరస్సు ఉండకూడదని శివుడు ఆజ్ఞాపించగా, కాలభైరవుడు తన గోటితో ఆ శిరస్సును తొలగించాడు. కేతకీ పుష్పాన్ని కూడా శివారాధనకు పనికిరాదని శపించాడు. అయితే, కేతకీ పువ్వు పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకోగా, శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో మాత్రం తన అర్చనకు దానిని ఉపయోగించవచ్చని వరం ఇచ్చాడు. ఈ లింగోద్భవ కాలం అత్యంత మహోత్కృష్టమైనది. ఇది శివుని నిరాకార, నిరామయ స్వరూపాన్ని, ఆయన ఆది మధ్యాంత రహితుడని సూచిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)