నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీ స్వామివారికి అర్చకులు వేదపండితులు, ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ముందు గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు.
ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. కన్నడ భక్తుల నడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలు వాహన సేవలలో ఈవో పెద్దిరాజు దంపతులు, ఆత్మకూరు డీఎస్పి శ్రీనివాసులు అధికారులు సహా భారీ ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..