Tirumala: తిరుమలలో వేడుకగా తుంబురు తీర్థ ముక్కోటి.. భక్తి పారవశ్యంలో భక్తులు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం కొండల్లోని తుంబురు తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది.

Tirumala: తిరుమలలో వేడుకగా తుంబురు తీర్థ ముక్కోటి.. భక్తి పారవశ్యంలో భక్తులు
Tumburu Theertha Mukkoti Festival
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Mar 26, 2024 | 7:29 AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైన ఏడుకొండలు.. ఎన్నో తీర్థాలకు, పవిత్ర ప్రదేశాలకు నిలయం. తూర్పు కనుమల్లోని అంతర్భాగంగా ఉన్న శేషాచలం కొండల్లోని తుంబురు తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. రెండ్రోజుల పాటు తుంబురు తీర్థానికి భక్తులను అనుమతించిన తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. తుంబురు తీర్థానికి సోమవారం ఉదయం 5 నుండి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు, ఈ రోజు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించింది టీటీడీ. పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించింది. ప్రథ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచింది.

గోన తీర్థంగా పిలిచే ఈ ప్రదేశంలోనే.. తుంబురుడు తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు ప్రకృతి అందాలతో తుంబురు తీర్థం కనువిందు చేస్తుంది. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో అలిగిన తుంబురుడు వెనక్కి తగ్గి ఈ తీర్థంలోనే కూర్చుండి పోతారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో స్వయంగా వేంకటేశ్వర స్వామి వెళ్లి తుంబురుడిని బుజ్జగించారని.. అందుకే ఆ ప్రాంతానికి తుంబుర తీర్థంగా పేరు గాంచిందని స్థల పురాణం. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు తుంబురు తీర్థంలోనే స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.

తీర్థానికి వెళ్లే భక్తులు ఎక్కువ దూరం నడవాల్సి ఉండటంతో గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్న వారికి అనుమతించలేదు. భ‌క్తులు వంట సామాగ్రి, క‌ర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టిటిడి విజ్ఞప్తి చేసింది.పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచిన టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.

ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తుంబురు తీర్థ ముక్కోటి పర్వదినాన తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించిన భక్తులు ఒక ప్రత్యేక అనుభూతిగా భావించగా తుంబురు తీర్థంకు భక్తులు పోటెత్తారు.

తిరుమల సప్తగిరుల్లో తుంబూరు తీర్థ ముక్కోటికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా ఉన్న తుంబురు తీర్థ ముక్కోటిలో దాదాపు 24 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…