తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉంటారు. వెంకన్న కొండపై భక్తుల రద్దీతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. వైకుంఠ వాసుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొంత మంది భక్తులు కోనేటి రాయుడికి తలనీలాలు సమర్పిస్తే.. మరికొందరు నగదు, బంగారం, విలువైన వస్తువులను హుండిలో కానుకలుగా సమర్పిస్తారు. ఇలాంటి కానుకలలో విలువైన వాచీలు, మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. తాజాగా వెంకన్న హుండీ ద్వారా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో వేలం వేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ వస్తువులను ఈ-వేలం ద్వారా ఈ నెల 24వ తేదీన విక్రయించనున్నామని టీటీడీ ప్రకటన ద్వారా తెలియజేసింది.
స్వామివారి ప్రధాన ఆలయంలో పాటు తిరుమల తిరుపతి క్షేత్రంలోని ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకలుగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ వేలం లో ఉంచనున్నామని ఆసక్తి ఉన్న భక్తులు ఆన్ లైన్ ఆక్షన్ లో పాల్గొనవచ్చు అంటూ ప్రకటించింది. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్ వెల్, ఫాస్ట్ ట్రాక్ వంటి ప్రముఖ కంపెనీ వాచీలతో పాటు కార్బన్, శాంసంగ్, నోకియా, మోటారోలా, ఒప్పో వంటి కంపెనీకి సంబంధించిన మొబైల్స్ ఫోన్లు కూడా ఉన్నాయని టిటిడీ వెల్లడించింది.
వీటిని మూడు కేటగిరీలుగా విభజించి వేలంలో పెట్టనున్నామని.. డ్యామేజి ఫోన్లు, వాచీలు, ఉపయోగించినవి, కొత్తవి అనే మూడు రకాలుగా విభజించి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. ఈ వస్తువులు కావాలని కోరుకునే భక్తులు వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.tirumala.org తో పాటు www.konugolu.ap.gov.in వెబ్ సైట్స్ ను సందర్శించమని సూచించింది. అంతేకాదు ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 0877-2264429 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపింది టీటీడీ మార్కెటింగ్ సిబ్బంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి