Tirumala: తిరుమల వేంకటేశుని సన్నిధిలో ప్రధానార్చకులుగా తిరిగి రమణ దీక్షితులు: అసలేం జరిగింది?

మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఏవీ రమణ దీక్షితులు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. 

Tirumala: తిరుమల వేంకటేశుని సన్నిధిలో ప్రధానార్చకులుగా తిరిగి రమణ దీక్షితులు: అసలేం జరిగింది?
Tirumala

Updated on: Apr 04, 2021 | 12:54 PM

Tirumala: మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఏవీ రమణ దీక్షితులు తిరిగి విధుల్లోకి చేరనున్నారు.

ఎందుకిలా?

సాధారణంగా రిటైర్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం అనేది అరుదైన చర్య. కానీ, టీటీడీలో ఇప్పుడు ఇదే జరిగింది.  అప్పట్లో అంటే మే 16, 2018న అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి 65 ఏళ్ళు దాటిన అర్చకులను పదవీ విరమణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు, టీటీడీ ప్రధాన ఆలయాలైన గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 65 ఏళ్ళు నిండిన అర్చకులు అందర్నీ పదవీ విరమణ చేయించారు.

ఆ సమయంలో శ్రీవారి ఆలయం ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న రమణదీక్షితులు, ఆయనతో పాటు మూడు ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, మరో పది మంది నాన్ మిరాశీ అర్చకులు విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే, తిరుచానూరు ఆలయానికి చెందిన కొందరు మిరాశీ అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ నిర్ణయంతో తాము కైంకర్యాలకు దూరం అయ్యామంటూ వారు కోర్టుకు విన్నవించారు. దీంతో వారిని తిరి కొనసాగించావాలంటూ హైకోర్టు డిసెంబర్ 2018లో ఆదేశాలు ఇచ్చింది. ఇదే తీర్పును తమకు వర్తింప చేయాలని రమణ దీక్షితులు కోరారు. కానీ అప్పటి ప్రభుత్వం, టీటీడీ స్పందించలేదు. దీంతో రమణ దీక్షితులు అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని కల్సి తనకు న్యాయం చేయాలని కోరారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రమణ దీక్షితులును శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించారు. కానీ, రమణ దీక్షితులు తనకు ప్రధాన అర్చకత్వమే కావాలని కోరుతూ వచ్చారు. దీంతో తాజాగా రమణ దీక్షితులతో పాటు వయోపరిమితితో అప్పట్లో విధులకు దూరమైన అందర్నీ హైకోర్టు తీర్పు మేరకు విధులకు హాజరు కావాలని ఉత్తరువులు జారీ చేసింది టీటీడీ.

ఈ మేరకు రమణ దీక్షితులు ఈరోజు తిరుమలలో ప్రధాన అర్చకునిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read: TTD News: తిరుమల వెంకన్న భక్తులకు శుభవార్త.. గదుల కోసం ఇకపై వెయిటింగ్‌కు చెక్

Kalyana Venkateswara Swamy: జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం